వేలిముద్రల నుంచి సంతకాల వైపు.. తెలంగాణలో అక్షర వెలుగులు!

Ullas Literacy

Ullas Literacy

Ullas Literacy: తెలంగాణవ్యాప్తంగా లక్షలాది మంది మహిళల జీవితాల్లో ఆదివారం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. చిన్నతనంలోనే వివాహాలు కావడం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరమైన దాదాపు 6.32 లక్షల మంది మహిళలు, వయోజనులు అత్యంత ఉత్సాహంగా ‘ఉల్లాస్’ అక్షరాస్యత పరీక్షకు హాజరయ్యారు. అమ్మకు అక్షరమాల, ఉల్లాస్ కార్యక్రమాల్లో భాగంగా నేర్చుకున్న ప్రాథమిక చదవడం, రాయడం, గణితం పాఠాల ఆధారంగా వీరికి ఈ మూల్యాంకన పరీక్ష నిర్వహించారు.

గ్రామీణ ప్రాంతాల్లోనే ఏకంగా 5.32 లక్షల మంది మహిళలు ఈ పరీక్ష రాసి తమ కలలకు ఊపిరి పోశారు. పట్టణ ప్రాంతాల్లో 98,324 మంది స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులతో పాటు 720 మంది వీధి వ్యాపారులు ఈ కేంద్రాల్లో ప్రత్యక్షమై పట్టుదలతో పరీక్ష రాశారు. ఇన్నాళ్లూ ఏ కాగితం మీదైనా వేలిముద్ర వేసిన చేతులు, ఇప్పుడు తమ పేర్లను స్పష్టంగా సంతకం చేస్తుండటంతో వారంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి అధికారికంగా విద్యనభ్యసించేందుకు కొత్త మార్గాలు తెరుచుకోనున్నాయి. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా నేరుగా పదో తరగతి ప్రవేశం పొంది, ఉన్నత విద్యవైపు అడుగులు వేసేందుకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. తమ స్వయం సమృద్ధికి, సొంత గుర్తింపునకు ఈ అక్షరాస్యత ఎంతగానో తోడ్పడుతుందని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.