Ganesh immersion: తొమ్మిది రోజుల పాటు భక్తి పారవశ్యంతో నవరాత్రి పూజలందుకున్న ఆ విఘ్ననాథుడు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో ఎప్పుడైనా గమనించారా? ‘గణపతి బప్పా మోరియా’ అంటూ లక్షలాది మంది భక్తులు వేడుకగా సాగనంపిన ఆ స్వామి, తీరా గంగమ్మ ఒడికి చేరకుండానే నిమజ్జనం పేరిట ఒడ్డున, అపరిశుభ్రమైన నీటిలో అర్థాంతరంగా మిగిలిపోతున్నాడు. తొలిపూజలందుకునే ఆ బొజ్జ గణపయ్యకు సరైన రీతిలో నిమజ్జనమే జరగకపోవడం, భక్తి వెనుక దాగున్న చేదు నిజానికి అద్దం పడుతోంది. నిమజ్జనం పూర్తి కాకుండానే చేతులు దులిపేసుకుంటున్న వైఖరి, స్వామి వారిని అవమానించడమే అవుతుందనే ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది.
అసలు వినాయక చవితి అనేది సంపూర్ణ పర్యావరణహితమైన పండుగ. ప్రకృతిలోని మట్టితో రూపుదిద్దుకునే విగ్రహం, పూజలో వాడే 21 రకాల పత్రులు.. ఇవన్నీ నీటిలో కలవడం వల్ల మన చెరువులకు జీవకళ వచ్చి, జలవనరులు శుద్ధి అయ్యేవి. కానీ నేడు సీన్ పూర్తిగా మారిపోయింది. భక్తి స్థానంలో ఆడంబరాలు, అట్టహాసాలు రాజ్యమేలుతున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలు, రసాయన రంగులను విరివిగా ఉపయోగిస్తూ చేజేతులా మన చెరువులను, నదులను నాశనం చేసుకుంటున్నాం.
పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేసి ఏదో గొప్ప ఘనకార్యం సాధించామనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. ప్రకృతిపై ప్రేమలేని పూజలు, పర్యావరణాన్ని బలితీసుకునే ఆరాధనల వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. కనీసం ఇప్పటికైనా భక్తులు ఆలోచించాలి. రాబోయే కాలంలోనైనా ఆడంబరాలను పక్కనపెట్టి, తిరిగి మట్టి విగ్రహాలను పూజించే సాంప్రదాయానికి ప్రాణం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
