పండగ వేళ షాకింగ్ న్యూస్.. ఏసీ, ఫ్రిజ్, టీవీ ధరలు భగ్గుమంటున్నాయి.. అక్టోబర్ 1 నుంచి పెంపు!

Electronics Price

Electronics Price

Electronics Price:  దసరా, దీపావళి పండుగల వేళ ఇళ్లకు కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు కంపెనీలు షాకింగ్ న్యూస్ చెప్పాయి. వచ్చే నెల అక్టోబర్ 1 నుంచి ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ముడి సరుకుల ధరల భారం, విపరీతంగా పెరిగిన రవాణా ఖర్చుల కారణంగా బ్లూ స్టార్, గోద్రెజ్, హైయర్, డైకిన్, ఎల్‌జీ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను 2 నుంచి 10 శాతం వరకు పెంచేందుకు సమాయత్తమయ్యాయి. విశేషమేమిటంటే ఈ ఒక్క ఏడాదిలోనే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.

ముఖ్యంగా ఏసీల తయారీలో అత్యంత కీలకమైన రాగి ధర అంతర్జాతీయ మార్కెట్లో మెట్రిక్ టన్నుకు 8,000 డాలర్ల నుంచి ఏకంగా 14,500 డాలర్లకు చేరుకుంది. దీంతో ఈ ప్రభావం నేరుగా ఏసీల తయారీ వెచ్చంపై పడింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీల ఉత్పత్తి ఖర్చులు దాదాపు 15 శాతం వరకు పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు రవాణా వ్యయాలు పెరగడంతో చిన్న సైజు టీవీల ధరలపై కూడా ఆ ప్రభావం పడనుంది. ఇక హైయర్ కంపెనీ అక్టోబర్ నుంచి జనవరి వరకు దశలవారీగా 15 శాతం వరకు ధరలు పెంచే యోచనలో ఉంటే, డైకిన్ ఇప్పటికే ధరల సవరణ పూర్తి చేసింది.

అయితే పండుగ సీజన్ ప్రారంభమవుతుండటంతో కొనుగోలుదారులకు ఒక చిన్న ఊరట లభించే అవకాశం ఉంది. కంపెనీలు అక్టోబర్ 1 నుంచే పెంపు నిర్ణయాన్ని అమలులోకి తెచ్చినప్పటికీ, డీలర్లు మరియు డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఇప్పటికే పెద్దమొత్తంలో పాత స్టాక్ అందుబాటులో ఉంది. దీనివల్ల చాలా ఉత్పత్తులు దీపావళి పండుగ వరకు పాత ధరలకే లభించే అవకాశం ఉందని మార్కెట్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. డీలర్ల వద్ద పాత స్టాక్ ముగిసిన తర్వాతే పెరిగిన కొత్త ధరలు మార్కెట్లో పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయని హోమ్ అప్లయన్సెస్ బిజినెస్ వర్గాలు వెల్లడించాయి.