చెరిసగం డ్రామాలాడుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్.. బండి సంజయ్ తీవ్ర ధ్వజం

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు చెరిసగం డ్రామాలు ఆడుతున్నాయని, కాంగ్రెస్‌ను నిలదీసే దమ్ము ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు ఏకోశానా లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను పురస్కరించుకుని కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ‘సేవా జ్యోతి’ ర్యాలీలో ఆయన మాట్లాడారు.

కేసీఆర్ హయాంలో జరిగిన భూ వివాదాలు, అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకునే నైతిక స్థైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అదే సమయంలో, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై పోరాడే దమ్ము బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన, చీకటి ఒప్పందాలు నడుస్తున్నాయని ఆరోపించారు.

ఎన్నికల కమిషన్ తీరుపై కాంగ్రెస్ చేస్తున్న గందరగోళాన్ని తిప్పికొడుతూ.. దేశంలో తొలిసారి ఓటు, సీటు చోరీ సంస్కృతికి తెరలేపింది కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు. దేశంలో లక్షలాది బోగస్ ఓట్లు ఉన్నాయని గతంలో మొత్తుకున్న కాంగ్రెస్, ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణలో ఆ దొంగ ఓట్లను తొలగిస్తుంటే ఎందుకు భయపడుతోందో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను సాకుగా చూపి రాజ్యాంగబద్ధ సంస్థలను బద్నాం చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని మండిపడ్డారు.

ఈ వ్యవహారంలో ఏదైనా అభ్యంతరం ఉంటే వీధుల్లో రభస చేయడం మాని, కోర్టుల్లో తేల్చుకోవాలని విపక్షాలకు హితవు పలికారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల నిష్కళంక పాలన, ప్రజాసేవనే బీజేపీకి శ్రీరామరక్ష అని, ప్రతిపక్షాల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.