తెలుగు రాష్ట్రాల గర్వకారణం.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం ప్రాజెక్ట్‌కు అరుదైన గౌరవం!

Srisailam Dam

Srisailam Dam

Srisailam Dam:  తెలుగు రాష్ట్రాల జలప్రదాయిని అయిన శ్రీశైలం డ్యాం ప్రపంచ స్థాయిలో అత్యంత అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ‘లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో శ్రీశైలం ప్రాజెక్ట్‌కు చోటు లభించింది.

ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును దక్కించుకున్న అతికొద్ది భారతీయ ప్రాజెక్టుల్లో శ్రీశైలం డ్యాం నిలవడం విశేషంగా నిలిచింది. సముద్ర మట్టానికి సుమారు 980 అడుగుల ఎత్తులో నిర్మితం కావడం, దీనికి అమర్చిన భారీ క్రస్ట్ గేట్ల పరిమాణం, విశిష్టమైన నిర్మాణ శైలి, నాణ్యతా ప్రమాణాలు ఈ అంతర్జాతీయ గుర్తింపు సాధించడంలో కీలక పాత్ర పోషించాయి.

గతంలో రికార్డు స్థాయిలో వచ్చిన భారీ వరద ప్రవాహాలను సైతం అత్యంత సమర్థవంతంగా తట్టుకుని నిలబడిన ఈ ప్రాజెక్టు భద్రతా విశేషాలను సేకరించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ బృందం, దీనిని ప్రపంచ రికార్డుగా పరిగణించింది.

ఈ మేరకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అందజేసిన ప్రశంసాపత్రాన్ని శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధికారికంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గుర్తింపు శ్రీశైలం డ్యామ్ నిర్మాణ విశిష్టతకు, నాటి ఇంజనీర్ల అద్భుత నైపుణ్యానికి దక్కిన అంతర్జాతీయ గౌరవమని కొనియాడారు. తెలుగు ప్రజలందరికీ ఇది ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.