ఏపీలో మోగినా స్థానిక సమర భేరి.. ఖరారైన మేయర్, చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు!

AP Elections

AP Elections

AP Elections: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అడుగు వేసింది. మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్‌లు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాల రిజర్వేషన్లను అధికారికంగా ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వర్గాల వారీగా మేయర్ పీఠాల కేటాయింపును ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.

కార్పొరేషన్ల మేయర్ స్థానాల్లో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 మేయర్ స్థానాన్ని కేటాయించారు. సాధారణ కేటగిరీలో జనరల్ మహిళలకు 5 స్థానాలు దక్కగా, మిగిలిన 4 స్థానాలను అన్‌రిజర్వ్‌డ్ రొటేషన్ విధానంలో స్థానాలుగా నిర్ధారించారు.

కార్పొరేషన్ల వారీగా వివరాలు:

జనరల్ మహిళ: విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ.

బీసీ జనరల్: ఏలూరు, అనంతపురం, చిత్తూరు.

ఎస్టీ: మంగళగిరి-తాడేపల్లి.

ఎస్సీ: రాజమహేంద్రవరం, కర్నూలు.

అన్‌రిజర్వ్‌డ్: తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు.

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలక సంఘాల్లో (మున్సిపాలిటీల్లో) బీసీ మహిళ, బీసీ జనరల్, ఎస్టీ మహిళ, ఎస్టీ, ఎస్సీ మహిళ, ఎస్సీ, జనరల్ మహిళ మరియు అన్‌రిజర్వ్‌డ్ విభాగాల వారీగా స్థానాలను క్షుణ్ణంగా విభజించారు. జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, కావలి, కదిరి, గూడూరు, కొండపల్లి, కుప్పం, పులివెందుల తదితర ప్రాంతాలకు సంబంధించి స్పష్టమైన రిజర్వేషన్లు ఖరారు కావడంతో స్థానిక నాయకులు సమరానికి సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్ల ఖరారుతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.