వాళ్లు దేశద్రోహులు కారు.. విద్యార్థుల పక్షాన నిలిచిన బాంబే హైకోర్టు!

MPSC protests

MPSC protests

MPSC protests: మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) రిక్రూట్‌మెంట్ పరీక్షల పారదర్శకతపై రోడ్డెక్కిన నిరుద్యోగ అభ్యర్థుల పక్షాన బొంబాయి హైకోర్టు నిలిచింది. హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులను ‘దేశద్రోహులు’ లేదా ‘సమాజ విద్రోహ శక్తులు’ అని ముద్ర వేయలేమని ధర్మాసనం తెగేసి చెప్పింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని భావించినప్పుడు తమ నిరసనను వ్యక్తం చేసే హక్కు పోటీ పరీక్షల అభ్యర్థులకు ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేసింది.

పుణె నగరంలో వేలాది మంది విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం, ఎంపీఎస్సీ బోర్డు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పుణె అనేది విద్యా కేంద్రమని, అక్కడ చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు సరదాగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయరని ధర్మాసనం గుర్తుచేసింది. యువత వీధుల్లోకి వచ్చారంటేనే వ్యవస్థలోని సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలని సూచించింది.

పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే అనుమానాలు వచ్చినప్పుడు విద్యార్థుల్లో ఏర్పడే అసంతృప్తిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని ఆదేశించింది. రిక్రూట్‌మెంట్‌లో నిజాయితీ, పారదర్శకతను కాపాడుతూ విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించే బాధ్యత సర్కారుపైనే ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రోడ్‌మ్యాప్‌ను కోర్టు స్వయంగా పర్యవేక్షిస్తుందని హామీ ఇచ్చింది. అదే సమయంలో, సుదీర్ఘంగా సాగే రహదారుల దిగ్బంధం వల్ల విద్యార్థుల భవిష్యత్తు, కెరీర్ ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున, కోర్టుపై నమ్మకంతో నిరసనలను విరమించి తరగతులకు హాజరుకావాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది.