voter list: ప్రజాస్వామ్య వ్యవస్థలను, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థలు అధికార పీఠం ముందర మోకరిల్లుతున్నాయా? అంటే సమాధానం ‘అవును’ అనే వస్తోందంటూ గళమెత్తాయి విపక్షాలు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విపక్ష కాంగ్రెస్ సమరశంఖం పూరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ పేరుతో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని పారదర్శకతను పాతిపెడుతున్నారనే ఆరోపణలతో ఇండియా కూటమి నేతలు వీధిపోరాటానికి దిగారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మార్చ్ చేపట్టిన పార్లమెంట్ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో జంతర్ మంతర్ పరిసరాలు ఉద్రిక్త రణరంగంగా మారాయి.
ఇండియా కూటమి ఎంపీలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆతిథ్యమిచ్చిన అనంతరం, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా నేతృత్వంలో ఎంపీలంతా జంతర్ మంతర్ వైపు నిరసన ర్యాలీగా బయలుదేరారు. రాజ్యాంగ పుస్తకాలను చేతుల్లో పట్టుకుని సాగుతున్న ఎంపీల మార్చ్‌ను నీతి ఆయోగ్, ఆకాశవాణి భవన్ మధ్యలో ఢిల్లీ పోలీసులు ముళ్లకంచెలు, బారికేడ్లతో అడ్డుకున్నారు. నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అని నేతలు ఎంత మొరపెట్టుకున్నా వినకుండా తోసిపారేయడంతో తోపులాట జరిగింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు విపక్ష నేతలను బలవంతంగా ఈడ్చిపారేసి ప్రత్యేక వ్యాన్లలోకి ఎక్కించి బరాఖంబా పోలీస్ స్టేషన్‌తో పాటు వివిధ ప్రాంతాలకు తరలించారు.
అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసుల తీరుపై ఎంపీ రేణుకా చౌదరి తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులపై మగ పోలీసులు చేతులు వేస్తూ విధి నిర్వహణ పేరుతో దౌర్జన్యం చేయడంపై మండిపడ్డారు. “ఖబర్దార్.. మీ డ్యూటీ ఏదో మీరు చేసుకోండి! పిచ్చి వేషాలు వేస్తే దవడ పళ్లు రాలుతాయి.. కాళ్లు విరిచి జేబులో పెట్టి పంపిస్తాం! అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. కాగా, బరాఖంబా పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యాక రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షాల బెదిరింపులకు, పోలీసుల అణచివేతకు తాము లొంగే ప్రసక్తే లేదన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా జోక్యంతో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమవుతున్నాయని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఈ ఆందోళన విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.
మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బరాఖంబా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని రాహుల్ గాంధీని పరామర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ఆనాడు బ్రిటీష్ పాలనపై ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమం సాగినట్టే, నేడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘జీకే (జ్ఞానేశ్ కుమార్) సర్ గో బ్యాక్’ ఉద్యమం ప్రారంభమైంది. బీజేపీ గెలవడం సాధ్యం కాక పోవడంతో ఈడీ, సీబీఐ, ఐటీల తరహాలోనే ఎన్నికల సంఘాన్ని కూడా రాజకీయాస్త్రంగా వాడుకుంటోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే ఆపి, తొలగించిన ఓట్లను తిరిగి చేర్చాలి. మోదీజీ తక్షణమే జాతికి క్షమాపణ చెప్పి జ్ఞానేశ్ కుమార్‌తో రాజీనామా చేయించాలి” అని డిమాండ్ చేశారు. పారదర్శకత లేని ఈ దొంగల పాలనపై కాంగ్రెస్, ఇండియా కూటమి దేశవ్యాప్తంగా రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
