రూ. 271 కోట్ల పెంట్ హౌస్
రియల్ ఎస్టేట్‌లో రికార్డు డీల్
మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ(ఆగస్ట్ 13): దేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఆల్ టైమ్ రికార్డు లావాదేవీ నమోదైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త మానవ్ సర్దానా గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ సంస్థకు చెందిన అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్టు ‘ది డాలియాస్’లో ఏకంగా రూ. 271 కోట్లకు ఒక పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేశారు. దేశంలో నమోదైన అత్యంత ఖరీదైన సింగిల్-హోమ్ ప్రాపర్టీ డీల్స్‌లో ఇది ఒకటి.
గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని సెక్టార్ 54లో ఉన్న ఈ పెంట్‌హౌస్ సూపర్ ఏరియా 17,200 చదరపు అడుగులు. సూపర్ ఏరియా లెక్కన చదరపు అడుగుకు రూ. 1.58 లక్షలు పలికింది. ‘ఇంపీరియల్ ఆటో ఇండస్ట్రీస్’ వ్యవస్థాపకుడు ఎస్‌బీ సర్దానా కుమారుడే ఈ మానవ్ సర్దానా. విలాసవంతమైన గృహాలకు విపరీతంగా పెరిగిన డిమాండ్‌ను ఈ భారీ డీల్ ప్రతిబింబిస్తోంది.
