కామినేని పరిసరాల్లో ప్రమాదకరంగా రోడ్లు
ఎల్బీ నగర్ మున్సిపల్ అధికారులకు కనిపించడం లేదా?
వాహనదారుల్లో పెరుగుతున్న అసహనం
ఇంకెన్నాళ్లిలా అంటూ ఆగ్రహం
మినిట్ 2 మినిట్, ఎల్బీనగర్ (ఆగస్ట్ 08): ఎల్బీ నగర్ పరిధిలోని కామినేని హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి రోజురోజుకూ అత్యంత దయనీయంగా మారుతోంది. ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే వాహనదారులు, బాటసారులు వణికిపోతున్నారు. ఎటు చూసినా పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తుండటంతో నిత్యం ప్రయాణం నరకప్రాయంగా మారిందని స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిద్రమత్తు.. ప్రాణాలకు నిత్యం ముప్పు
రహదారి నిండా లోతైన గోతులు ఏర్పడి, స్వల్ప వర్షానికే నీరు చేరి ప్రమాదకరంగా మారుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ఈ గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రధాన రహదారిలోనే ఈ స్థాయి గోతులు ఉన్నప్పటికీ.. మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రజలు నేరుగా నిలదీస్తున్నారు. “వాహనదారుల అవస్థలు, ప్రాణసంకటం అధికారులకు కనపడాలంటే మేము ఇంకేం చేయాలి? అసలు ఈ రోడ్లను బాగుచేసే ఉద్దేశం మున్సిపల్ అధికారులకు ఉందా లేదా?” అని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే మరమ్మతులు చేపట్టాలి
కామినేని ఆసుపత్రి ప్రాంతం నిత్యం వందలాది రోగులు, అత్యవసర అంబులెన్సులు, వేలాది వాహనాలతో రద్దీగా ఉండే అత్యంత కీలకమైన జంక్షన్. ఇటువంటి సున్నితమైన ప్రాంతంలో రహదారులు అధ్వానంగా మారడం వల్ల అత్యవసర వైద్య సేవల కోసం వచ్చేవారు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ, మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి కామినేని పరిసర ప్రాంత రహదారులకు తక్షణమే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయాల ముట్టడితో పాటు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
