ఆర్టీసీ – మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కామన్ పాస్ ధరల తగ్గింపుపై ప్రభుత్వ పునఃపరిశీలన

Common Pass

Common Pass

Common Pass: ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై తీవ్ర ప్రజా వ్యతిరేకత మరియు ఫిర్యాదులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కామన్ పాస్ ధరలను పునఃపరిశీలించి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా పునర్నిర్ణయిస్తామని రాష్ట్ర రవాణా,  బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రస్తుతం రోజువారీ కామన్ పాస్ ధర రూ.400 (మెట్రో రూ.300, ఆర్టీసీ రూ.100) కాగా, నెలవారీ కామన్ పాస్ ధర రూ.8,500 (మెట్రో రూ.7,000, ఆర్టీసీ రూ.1,500)గా ఉంది. ఈ ధరలు రోజువారీ ప్రయాణికులకు తీవ్ర భారాన్ని మోపుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

త్వరలో ఉన్నతాధికారులతో సమీక్ష – ప్రభుత్వ లక్ష్యం స్పష్టం:
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు ప్రజా సమస్యలను పరిగణనలోకి తీసుకుని వాస్తవ పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను విస్తృతం చేయడం మరియు ప్రయాణికులపై అదనపు భారం పడకుండా చూడటమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే అతిత్వరలోనే దేవాదాయ/రవాణా మరియు మెట్రో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రయాణికులకు ఉపయోగపడే రీతిలో సవరించిన చౌకైన ధరలను ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.