Indrakeeladri Dasara: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించే చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ (CFO) పదవి నుంచి దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ ఎస్.ఎస్. చంద్రశేఖర్ ఆజాద్ను ప్రభుత్వం తక్షణమే తప్పించింది.
కొద్ది రోజులుగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పర్యవేక్షణ, దర్శన క్యూలైన్ల నిర్వహణ మరియు వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం ఏర్పడిందన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నూతన సిఎఫ్ఓగా వి. త్రినాథరావు నియామకం – నేటి నుంచి విధులు:
చంద్రశేఖర్ ఆజాద్ స్థానంలో నూతన చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా వి. త్రినాథరావును నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఈరోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నూతన ఆదేశాల మేరకు వి. త్రినాథరావు నేటి నుంచి ఉత్సవాలు పూర్తయ్యే వరకు (అక్టోబర్ 20వ తేదీ వరకు) విజయవాడలోనే విడిది చేసి, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండనున్నారు.
భక్తుల క్యూలైన్ల సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు మరియు వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయాన్ని ఆయన నిరంతరం పర్యవేక్షించనున్నారని దేవాదాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
