LB NAGAR: కోచ్ లేక కష్టాలు పడుతున్న యువక్రికెటర్లు !

మూడు నెలలుగా విద్యార్థుల ఎదురు చూపులు

సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో పరిస్థితి

అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం శూన్యం

మినిట్ 2 మినిట్, ఎల్బీ నగర్(ఆగస్ట్ 19): సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో అధికారుల అలసత్వం, నిర్లక్ష్య వైఖరిపై ‘మినిట్ 2 మినిట్’ వేదికగా ఈ నెల 11న ప్రచురించిన కథనం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా స్టేడియం ప్రాంగణంలో మరో తీవ్రమైన సమస్య వెలుగులోకి వచ్చింది. గత కొన్ని నెలలుగా ఇక్కడ సరైన క్రికెట్ కోచ్ లేకపోవడంతో, శిక్షణ కోసం వస్తున్న చిన్నారులు, యువ క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

2026 జూన్ నెల నుంచి నేటి వరకు ఇక్కడ అర్హత కలిగిన క్రికెట్ కోచ్ అందుబాటులో లేకపోవడం శోచనీయం. కోచ్ మార్గదర్శకత్వం లేక పిల్లల విలువైన సాధన సమయం వృథా అవుతోందని, ఆటలో వారి పురోగతి పూర్తిగా మందగించిందని ఆందోళన చెందుతున్నారు. ఈ తీవ్రమైన సమస్యపై క్రీడాకారుల తల్లిదండ్రులు ఇప్పటికే జిల్లా క్రీడల అధికారి (D.S.O) స్వర్ణలత దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి సంతృప్తికరమైన స్పందనగానీ, శాశ్వత పరిష్కారంగానీ లభించలేదు. ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించి దేశానికి పేరు తేలాలని ఎంతోమంది చిన్నారులు అహర్నిశలు కష్టపడుతున్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాథమిక దశలోనే వారి కలలు కల్లలయ్యే ప్రమాదం ఏర్పడింది. సరైన మార్గదర్శకత్వం లేకపోతే పిల్లల ప్రతిభ మరుగునపడిపోయే అవకాశముంది.

క్రీడాకారుల భవిష్యత్తును, తల్లిదండ్రుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని క్రీడా శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. సరూర్‌నగర్ స్టేడియంలో వెంటనే అర్హత, అనుభవం కలిగిన క్రికెట్ కోచ్‌ను నియమించి వర్ధమాన క్రీడాకారులకు న్యాయం చేయాలని స్థానికులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.