SDRF Rescue: వరద నీటిలో చిక్కుకున్న జాలర్ల ప్రాణాలను కాపాడేందుకు వెళ్లిన 10 మంది ఎస్డీఆర్ఎఫ్ (SDRF), అగ్నిమాపక (ఫైర్) సిబ్బంది ప్రమాదవశాత్తు వరద హోరులో గల్లంతైన విషాదకర ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ వర్షాల ధాటికి బేతుపల్లి పెద్ద చెరువు అలుగు ఉద్ధృతంగా పారుతుండటంతో చేపలు కొట్టుకుపోకుండా వలలు వేసేందుకు ఐదుగురు జాలర్లు వెళ్లారు.
నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వారు వరద మధ్యలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు తొలుత ముగ్గురు ఫైర్ సిబ్బంది బోటులో వెళ్లగా, ఆ బోటు ఇంజిన్ మొరాయించడంతో వారు కూడా నిలిచిపోయారు. దీంతో సహాయక చర్యల కోసం కొత్తగూడెం నుంచి వచ్చిన ఆరుగురు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, మరో నలుగురు ఫైర్ సిబ్బంది రెండు బోట్లలో రంగంలోకి దిగారు.
తొలుత చిక్కుకున్న ముగ్గురు ఫైర్ సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అనంతరం, మత్స్యకారులను తీసుకువచ్చేందుకు వెళ్తుండగా ఉద్ధృతమైన వరద తాకిడికి రెండు బోట్లు ఒక్కసారిగా పల్టీలు కొట్టాయి. దీంతో బోట్లలో ఉన్న 10 మంది సిబ్బంది వరద నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఈ వార్త తెలియగానే ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి తక్షణమే అక్కడికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు.
భద్రాచలం నుంచి అత్యవసరంగా ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను రప్పించి, డ్రోన్ల ద్వారా లైఫ్ జాకెట్లు అందజేస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. సత్తుపల్లి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కలెక్టర్‌తో మాట్లాడి ఆరా తీశారు. గల్లంతైన సిబ్బందిని, మత్స్యకారులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు సాధ్యమైన అన్ని మార్గాలను వినియోగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు పరిస్థితిని నిమిష నిమిషానికి సమీక్షించాలని సూచించారు.
