రైడర్ల తిరుగుబాటు.. కదిలిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. హస్తినాపురం స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో షాకింగ్ నిజాలు!

Swiggy Instamart

Swiggy Instamart

Swiggy Instamart: ఫోన్ స్క్రీన్‌పై ఒక్క క్లిక్.. పదే పది నిమిషాల్లో ముంగిట్లోకి కావాల్సిన వస్తువులు! క్విక్ కామర్స్ మెరుపు వేగానికి ముచ్చటపడి ఆర్డర్ ఇస్తున్న అమాయక వినియోగదారులకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ విషాన్ని వడ్డిస్తోంది! వేగం మాటున ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ, ఐదు నెలల క్రితమే గడువు ముగిసిన ఆహార పదార్థాలను యథేచ్ఛగా ఇంటింటికీ డెలివరీ చేస్తోంది. నగరవ్యాప్తంగా ఇప్పటికే పలుచోట్ల ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో అక్రమాలు తేలి లైసెన్సులు రద్దయినా, పైసల మేతకు అలవాటు పడిన ఈ సంస్థకు, ప్రజల ప్రాణాలపై ఎటువంటి జాగ్రత్త లేదనడానికి హస్తినాపురంలో బట్టబయలైన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డార్క్ స్టోర్ బాగోతమే సజీవ సాక్ష్యం.

తమ కష్టాన్ని నమ్ముకుని రాత్రింబవళ్ళు శ్రమించే డెలివరీ రైడర్లను మనుషులుగా కూడా గుర్తించకుండా పురుగుల్లా చూస్తూ, హక్కులకై ప్రశ్నించిన వారి ఐడీలను అక్రమంగా బ్లాక్ చేస్తూ నిరంకుశంగా వ్యవహరించింది ఈ యాజమాన్యం. అయితే, యాజమాన్యపు దౌర్జన్యాలకు భయపడకుండా రైడర్లు ఎగరేసిన తిరుగుబాటు జెండా మూడ్రోజుల్లో ఈ సంస్థ అక్రమ సామ్రాజ్యాన్నే కుదిపేసింది. రైడర్ల అలుపెరుగని పోరాటంతో దిగివచ్చిన అధికారులు బుధవారం హస్తినాపురం జెడ్పీ రోడ్‌లోని డార్క్ స్టోర్‌లో సోదాలు జరిపారు. ఎల్బీనగర్ జోన్ (సర్కిల్ 11) ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) ఎ. సన్నీ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో విస్తుపోయే దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ తనిఖీల వివరాలను ఫుడ్ సేఫ్టీ అధికారి ఎ. సన్నీ మీడియా ముఖంగా బహిర్గతం చేశారు. స్టోర్‌లో అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచిన పదార్థాలు లభ్యమయ్యాయని తెలిపారు. ముఖ్యంగా అల్లం-వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో ఫ్రూట్ డ్రింక్, స్ట్రాబెర్రీ జ్యూస్, చిక్కీ ఆటా, బీబీక్యూ సాస్, కుకీస్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, పన్నీర్, పాలు సహా ఏకంగా 14 రకాల ఆహార ఉత్పత్తులను గుర్తించినట్టు తెలిపారు. కొన్ని పదార్థాలను ఐదు నెలల క్రితమే గడువు ముగిసిపోయిన స్థితిలో ఉన్నట్లు స్పష్టంగా నిర్ధారించారు. ఫ్రిజ్, కోల్డ్ స్టోరేజ్ ఏరియా అంతా అసహ్యకరమైన దుర్గంధంతో, అపరిశుభ్రంగా ఉందన్నారు. వీటన్నింటిపై పక్కాగా ఆధారాలు నమోదు చేసి, నివేదికను ఉన్నతాధికారులకు నివేదించామని, చట్టపరమైన కఠిన చర్యలు తథ్యమని తేల్చిచెప్పారు.

సోదాల వేళ తమ పాపాలు బయటపడకుండా మీడియాను, రైడర్లను అడ్డుకునేందుకు మార్ట్ సిబ్బంది దౌర్జన్యానికి దిగినప్పటికీ నిజం దాచలేకపోయారు. మరోవైపు ఈ పోరాటంలో కర్షక, కార్మిక కాంగ్రెస్ నేతలు శ్రమజీవుల పక్షాన నిలబడ్డారు. కేకేసీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ టి. రాజశేఖర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ అబ్దుల్ జిలాని, మున్నా జానీ, రాహుల్ గాంధీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జిల్లా శ్రీనివాస్, యాదగిరి తదితరులు ఇన్‌స్టామార్ట్ దోపిడీని ఎండగడుతూ రైడర్లకు కొండంత అండగా నిలిచారు. ఈ వ్యవహారంలో హస్తినాపురం డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు దెంది శశిధర్ రెడ్డి నేరుగా కల్పించుకుని రైడర్లకు పూర్తి మద్దతు ప్రకటించారు. శ్రమ దోపిడీకి పాల్పడుతూ, కాలం చెల్లిన విషపదార్థాలతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

కాగా, నగరంలో క్విక్ కామర్స్ డార్క్ స్టోర్ల నిర్వాకంపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ యంత్రాంగం (TG SAFE / H-FAST) సింహస్వప్నంగా మారింది. ఇటీవల సైదాబాద్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గడువు ముగిసిన సరుకులు, బొద్దింకలు, తుప్పు పట్టిన రాక్‌లు ఉండటంతో లైసెన్స్ రద్దు చేసిన అధికారులు.. పేట్ బషీరాబాద్ (స్విగ్గీ), చార్మినార్ (ఫ్లిప్‌కార్ట్ ఇన్‌స్టాకార్ట్), రాంకోఠి (జెప్టో) డార్క్ స్టోర్ల లైసెన్సులను సైతం రద్దు చేశారు. ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న హస్తినాపురం ఇన్‌స్టామార్ట్‌ను తక్షణమే శాశ్వతంగా సీల్ చేసి, బాధ్యులను జైలుకు పంపాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.