Power Theft: ఉప్పల్ భగాయత్ పరిధిలో విద్యుత్ చోరీ యథేచ్ఛగా సాగుతోంది. స్థానిక విద్యుత్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే కొందరు వ్యక్తులు ఏళ్లుగా కరెంట్ దందా సాగిస్తున్నా అధికారులు చోద్యం చూడటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ భగాయత్‌ను ఆనుకుని ఉన్న అక్రమ షెడ్లలో వినాయక విగ్రహాలు, దుర్గామాత విగ్రహాల తయారీని కొందరు వ్యాపారంగా నిర్వహిస్తున్నారు. అయితే, విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి అధికారిక మీటర్లు పొందకుండానే, పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి నేరుగా తీగలు (హుకింగ్) వేసి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. భారీ స్థాయిలో విద్యుత్‌ను వినియోగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
ఇంత పెద్ద ఎత్తున అక్రమం జరుగుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక స్థానిక లైన్‌మ్యాన్ హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కాసులకు కక్కుర్తి పడి అధికారులు, సిబ్బంది చేతులు తడుపుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు అధికారులు వచ్చి కంటితుడుపు చర్యగా తీగలను తొలగిస్తున్నప్పటికీ, వారు వెళ్లగానే మళ్లీ యథావిధిగా విద్యుత్ చోరీకి తెగబడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విద్యుత్ చౌర్యం శిక్షార్హమైన నేరం
చట్ట ప్రకారం అనుమతి లేకుండగా విద్యుత్‌ను నేరుగా వాడటం (విద్యుత్ చౌర్యం) తీవ్రమైన నేరం. ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం విద్యుత్ చోరీకి పాల్పడితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదు. అంతేకాకుండా, ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా నేరుగా కరెంట్ వైర్లు లాగడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అమాయకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా, ప్రభుత్వ ఆస్తిని కాపాడేందుకు ప్రజలందరూ సక్రమంగా మీటర్ల ద్వారానే విద్యుత్‌ను వినియోగించాలని విద్యుత్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.
