TELANGANA:పోలీస్ ఉద్యోగార్థులకు రేవంత్ సర్కార్ బిగ్ అలర్ట్ !

పోలీస్ ఉద్యోగార్థులకు రేవంత్ సర్కార్ బిగ్ అలర్ట్
యూనిఫామ్ పోస్టుల వయోపరిమితి మరో రెండేళ్లు పెంపు!
మొత్తం ఏడేళ్లకు పెరిగిన గరిష్ఠ వయోపరిమితి

మినిట్ 2 మినిట్, హైదరాబాద్(ఆగస్ట్ 15): తెలంగాణలో యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం సన్నాహాలు చేస్తున్న నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. పోలీస్ తదితర శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని అదనంగా మరో రెండేళ్లు పెంచుతూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం. 122) జారీ చేశారు.

గతంలో ఇచ్చిన ఐదేళ్ల సడలింపునకు అదనంగా ఈ రెండేళ్లను జత చేయడంతో నిరుద్యోగులకు మొత్తం ఏడేళ్ల వరకు వయోసడలింపు లభించనుంది. దీంతో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లకు, ఎస్సై పోస్టులకు 37 ఏళ్లకు పెరిగినట్లయింది. వయోపరిమితి పెంచాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.

ఈ శాఖలకు వర్తింపు:
తాజా ఉత్తర్వుల ప్రకారం పెంచిన వయోపరిమితి పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్), ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్, ఫారెస్ట్ శాఖల పోస్టులకు వర్తిస్తుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వివిధ శాఖల్లో 7,437 ఖాళీల భర్తీకి ప్రకటనలు విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లక్షలాది మంది అభ్యర్థులకు పోటీపడే అవకాశం దక్కింది.