Rural Development: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. స్వంత భవనాలు లేని 5,118 గ్రామ పంచాయతీల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రాంతీయ సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఆమె, ఇప్పటికే 3,269 భవనాల నిర్మాణాలు 70 శాతం మేర పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఏడాదిలోనే పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 8,000 గ్రామాల్లో మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి రూ. 800 కోట్లు కేటాయించగా, ఆ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు.
రూ.3,382 కోట్లతో రోడ్ల నిర్మాణం!
దేశంలోనే తొలిసారిగా ‘హ్యామ్’ విధానంలో గ్రామీణ రహదారులను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రూ. 3,382 కోట్ల అంచనా వ్యయంతో 3,861 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి మండలానికి ముగ్గురు సభ్యులతో ‘డ్రింకింగ్ వాటర్ మేనేజ్‌మెంట్ కమిటీ’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల కొరత లేకుండా చూస్తూ, కేటాయించిన రూ. 6,000 కోట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
