Power Cuts: తెలంగాణలో ఇటీవల చోటుచేసుకుంటున్న విద్యుత్ అంతరాయాలపై అధికారుల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరఫరా సజావుగా సాగేందుకు పలుమార్లు ఆదేశించినా పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే స్పెషల్ సీఎస్, జెన్కో సీఎమ్డీలతో సహా ఎవరినీ ఉపేక్షించేది లేదని, అవసరమైతే సస్పెండ్ చేస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
నైనీ, మహానది నుంచి బొగ్గు లింకేజీలు ఏర్పాటు చేసినప్పటికీ యాదాద్రి విద్యుత్ ప్లాంట్లో పూర్తి సామర్థ్యం మేర ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని నిలదీశారు. రైతులకు, పంటలకు అవసరమైన విద్యుత్ ఇవ్వాలని చెప్పినా అధికారులు పెడచెవిన పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది తానేనని, విద్యుత్ కోతలకు గల కారణాలను వెంటనే తేల్చి తనకు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఎల్ నినో పరిస్థితులు.. ముందస్తు ప్రణాళికలకు ఆదేశం:
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, తాగునీటి సరఫరా మరియు పశుగ్రాసం కొరతపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాగునీటి ఎద్దడి రాకుండా పక్కా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణాలు, ఇతర అవసరాలకు మురుగునీటి శుద్ధి కేంద్రాల (STP) ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ నినోను ఒక విపత్తుగా పరిగణించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి గ్రూప్-1, గ్రూప్-2 అధికారులను నియమించి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
