‘గెజిట్’ షాక్.. పార్టీ ఫిరాయింపుల వేటుతో దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు!

Danam Nagender

Danam Nagender

Danam Nagender: రాష్ట్ర రాజధాని రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వంపై వేటు పడింది. ఈ మేరకు అసెంబ్లీ సచివాలయం అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గులాబీ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ వైపు అడుగులు వేసిన ఆయనపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్నారు. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల వేడి మళ్లీ మొదలైంది.

ఈ అనర్హత వేటు 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు శాసనసభ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు జారీ చేసిన ప్రకటనలో వెల్లడించారు. నాటి నుంచే ఖైరతాబాద్ స్థానం ఖాళీగా మారినట్లు స్పష్టం చేయడంతో, ఉప ఎన్నిక అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. చట్టపరమైన నిబంధనలు, న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించే అసెంబ్లీ సచివాలయం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

గెజిట్ విడుదల కావడానికి కాసేపటి ముందే దానం నాగేందర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు స్థానికంగా కాకరేపాయి. ఖైరతాబాద్‌పై ఉప ఎన్నికల మేఘాలు అలుముకుంటే దిమ్మతిరిగే తీర్పు ఇస్తామంటూ ఆయన గర్జించారు. అయితే ఆయన మాట్లాడిన కొద్ది సమయానికే అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు అధికారిక ముద్ర పడటం గమనార్హం. సభ్యత్వ రద్దుతో ఇప్పుడు గ్రేటర్ పరిధిలో ఉప ఎన్నికల పోరుకు ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలకు సిద్ధమవుతున్నాయి.