Pharma City: యాచారం మండలంలో ప్రతిపాదించిన ఫార్మాసిటీని తక్షణమే రద్దు చేసి, సేకరించిన భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఫార్మా బాధిత రైతులు సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి క్యాంపు కార్యాలయం (ప్రజాభవన్)ను ముట్టడించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు “ఫార్మాసిటీ రద్దు చేయాలి.. మా భూములు మాకు ఇవ్వాలి” అంటూ బిగ్గరగా నినాదాలు చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఎన్నికల సమయంలో తమ భూముల సమస్యను పరిష్కరిస్తామని ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారని, మూడేళ్లు గడిచినా పరిష్కారం లభించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఫార్మాసిటీ భూములపై పునఃపరిశీలన చేసి, ప్రతిపాదనలను రద్దు చేయాలని కోరారు. ఆనాడు హామీలు ఇచ్చిన నేతలు మాటలు కాకుండా చేతల్లో చూపించాలని, అసెంబ్లీలో తమ సమస్యను ప్రస్తావించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాభవన్‌ను ముట్టడించిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల్లో తరలించారు. ఆ సమయంలో ఓ రైతు బస్సులోనే ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. తోటి రైతులు, పోలీసులు తక్షణమే స్పందించి అడ్డుకోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. జీవనాధారమైన భూముల కోసం తాము చేస్తున్న పోరాటం సమస్య తేలేవరకు కొనసాగుతుందని, ప్రభుత్వం స్పందించి భూములను అప్పగించాలని బాధితులు స్పష్టం చేశారు.
