Ration Card: రేషన్ కార్డుల ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అర్హత లేని వారిని, అనర్హులను తొలగించే చర్యల్లో భాగంగా అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయబోతున్నారు. ఈ కఠిన నిర్ణయంలో భాగంగా వచ్చే నెలలో దేశవ్యాప్తంగా దాదాపు 1.58 కోట్ల రేషన్ కార్డులను హోల్డ్‌లో పెట్టడానికి కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ చర్యలు వేగవంతం చేసింది.
నకిలీ, డూప్లికేట్ కార్డులు, చనిపోయిన వ్యక్తుల పేర్లతో సరుకులు పొందుతున్న అక్రమాలను అరికట్టడానికే ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. ఈ-కేవైసీ, బయోమెట్రిక్ సీడింగ్, డిజిటలైజేషన్ ద్వారా పీడీఎస్ డేటాబేస్‌ను ఇప్పటికే పూర్తిస్థాయిలో శుద్ధి చేశారు. నిబంధనలు కఠినతరం చేయడంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 5.8 కోట్ల బోగస్ రేషన్ కార్డులను తొలగించినట్లు అధికారులు తెలిపారు.
అయితే కార్డులు నిలిపివేసినంత మాత్రాన లబ్ధిదారుల పేర్లను వెంటనే డేటాబేస్ నుంచి శాశ్వతంగా తొలగించరు. కార్లు డిసేబుల్ అయిన లబ్ధిదారులు తాము నిజమైన అర్హులమేనని నిరూపించుకోవడానికి ప్రభుత్వం మూడు నెలల సమయం ఇస్తోంది. ఈ మూడు నెలల వ్యవధిలో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసుకుని, తమ ఆధార్, ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకుంటే ఆ కార్డులను మళ్లీ యాక్టివేట్ చేస్తారు. ఆరు నెలలుగా ఎలాంటి రేషన్ తీసుకోని కార్డులను మాత్రమే ఈ పరిధిలోకి తీసుకొస్తున్నారు.
