ఓటు హక్కుపై కుట్రకు సుప్రీం చెక్.. ఈసీకి స్ట్రాంగ్ వార్నింగ్!

Voter Deletions

Voter Deletions

Voter Deletions: ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును కాలరాసేలా జరుగుతున్న కుట్రలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ – SIR) ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ, ఓటర్ల పేర్ల తొలగింపు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీలోని ముస్తఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిజమైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు పెద్ద ఎత్తున తప్పుడు ‘ఫారం-7’ దరఖాస్తులు దాఖలయ్యాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

క్షుణ్ణంగా పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి

ఈ వ్యవహారంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సాధారణంగా ఓటర్ల జాబితాలో పేరు తొలగించేందుకు లేదా అభ్యంతరాలు తెలిపేందుకు ‘ఫారం-7’ను ఉపయోగిస్తారు. అయితే, దీనిని దుర్వినియోగం చేస్తూ అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశాన్ని ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. ముస్తఫాబాద్ నియోజకవర్గంలో దాఖలైన తప్పుడు దరఖాస్తుల వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, వాస్తవాలను నిగ్గుతేల్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఓటరు హక్కుల రక్షణే ప్రధానం

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఎలాంటి పొరపాట్లకు, రాజకీయ ప్రేరేపిత తొలగింపులకు తావులేకుండా తక్షణమే తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఈసీకి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియ ముగుస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు, ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడాలని చూస్తున్న శక్తులకు గట్టి హెచ్చరికగా మారాయి. నిజమైన ఓటర్ల హక్కులను కాపాడేందుకు ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.