తమిళనాడు రాజకీయాల్లో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన ‘జెయింట్ కిల్లర్’ వీఎస్ బాబు కన్నుమూత!

VS Babu

VS Babu

VS Babu: తమిళనాడు అధికార పార్టీ టీవీకే (TVK) లో తీవ్ర విషాదం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన కొలత్తూరు ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, సెప్టెంబర్‌లో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే గురువారం మధ్యాహ్నం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, 2.24 గంటలకు కార్డియాక్ అరెస్టుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.

స్టాలిన్‌పై గెలుపుతో దేశవ్యాప్త గుర్తింపు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత స్టాలిన్‌కు కంచుకోటగా భావించే కొలత్తూరు నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా వీఎస్ బాబు బరిలోకి దిగారు. హోరాహోరీగా సాగిన పోరులో స్టాలిన్‌పై ఏకంగా 8,795 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి బాబు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచారు. గెలుపు అనంతరం స్టాలిన్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

వీఎస్ బాబు మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి ఒక బలమైన నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.