సనాతన సంస్కృతికి సారథి.. విశ్వగురువు దిశగా ఒక అడుగు.. డాక్టర్ యాగండ్ల సురేష్ స్ఫూర్తిదాయక ప్రస్థానం!

Vedic Science

Vedic Science

Vedic Science: భారతీయ సనాతన సంస్కృతి, వేద విజ్ఞానం కేవలం గతానికి సంబంధించిన చరిత్ర మాత్రమే కాదు.. నేటి ఆధునిక ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపే జీవన మార్గదర్శి. అటువంటి అమూల్యమైన భారతీయ వారసత్వాన్ని, సంస్కృత భాషా వైభవాన్ని భావితరాలకు అందించాలనే మహోన్నత సంకల్పంతో అడుగులు వేస్తున్నారు డాక్టర్ యాగండ్ల సురేష్. వేద విజ్ఞానం, యోగా ప్రచారం, యువతలో నైతిక విలువలు మరియు నాయకత్వ లక్షణాల పెంపునకు ఆయన చేస్తున్న కృషి నేడు సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.

వేములవాడ నుంచి ఉస్మానియా వరకు సాగిన విద్యా ప్రస్థానం

చిన్ననాటి నుంచే సంస్కృత భాష, భారతీయ సంప్రదాయాల పట్ల మక్కువ పెంచుకున్న డాక్టర్ సురేష్, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని న్యూబోయిన్‌పల్లి శ్రీ వేంకటేశ్వర వేదాంత వర్ధిని కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతంలో ఎం.ఏ., పీహెచ్‌డీ పట్టాలను అందుకున్నారు. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భగవద్గీత, భారతీయ తత్వశాస్త్రంపై లోతైన పరిశోధనలు చేసిన ఆయన, ప్రస్తుతం సికింద్రాబాద్ సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్ వివేకానంద కళాశాలలో సంస్కృత అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. కేవలం తరగతి గది బోధనకే పరిమితం కాకుండా, ప్రాచీన గ్రంథాల్లోని ఆయుర్వేదం, గణితం, ఖగోళశాస్త్ర విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించి విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందిస్తున్నారు.

‘ఓం సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్’ – ఒక సామాజిక చైతన్యం

సమాజంలోని అన్ని వర్గాలకు ఆధ్యాత్మిక, నైతిక మార్గదర్శనం అందించాలనే దృఢ సంకల్పంతో డాక్టర్ సురేష్ ‘ఓం సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్’ (SDPT) ను స్థాపించారు. “సర్వే జనాః సుఖినో భవంతు” అనే వేద వాక్కును ఆచరణలో పెడుతూ, ప్రతి ఇంటిలో భగవద్గీత జ్ఞానం వినిపించాలని, ప్రతి గ్రామం ఒక ‘యోగా గ్రామం’గా మారాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యత సాధించేందుకు యోగా, ప్రాణాయామం, ధ్యాన శిబిరాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని నింపుతున్నారు.

యువతకు నాయకత్వ శిక్షణ – అన్ని వర్గాలకు సేవా హస్తం..

కేవలం డిగ్రీలు, ఉద్యోగాలకే పరిమితం కాకుండా విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, నిజాయితీ కలిగిన పౌరులుగా ఎదగాలన్నది ఆయన ఆశయం. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులుగా ఎదిగే యువతలో “కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” అనే భగవద్గీత సందేశాన్ని నాటుతున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా రైతులకు సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు పేద విద్యార్థులకు ప్రోత్సాహం, రక్తదాన శిబిరాలు, వృద్ధులకు సామాజిక సహకారం వంటి బహుముఖ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.

వికసిత భారత్ నుంచి విశ్వగురువు దిశగా..

ఆర్థిక ప్రగతితో పాటు నైతిక విలువలు, అవినీతి రహిత సమాజం, సాంస్కృతిక వైభవం తోడైనప్పుడే నిజమైన ‘వికసిత భారత్’ సాధ్యమవుతుందని డాక్టర్ సురేష్ విశ్వసిస్తున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ ధ్యాన పరిశోధనా కేంద్రాలు, గురుకులాలు, సనాతన ధర్మంపై ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. “వసుధైవ కుటుంబకం” అనే మహోన్నత భావనతో జ్ఞానం, యోగా, ధ్యానం, సేవ, సంస్కారం అనే ఐదు సూత్రాల ద్వారా భారతదేశాన్ని తిరిగి విశ్వగురువు స్థానంలో నిలబెట్టేందుకు డాక్టర్ యాగండ్ల సురేష్ సాగిస్తున్న ఈ ఆశయ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.