“నమ్మిన వాళ్లను ముంచడం ఆయన నైజం”.. కేటీఆర్‌పై కవిత తీవ్ర విమర్శలు!

Telangana Politics

Telangana Politics

Telangana Politics:  విదేశీ బొగ్గు కొనుగోలు ఒప్పందాల విచారణ పేరుతో ప్రతిమ శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా లేఖ రాయడంపై కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ కాలంలో బీఆర్‌ఎస్‌కు పూర్తి అండగా నిలిచిన శ్రీనివాసరావుపై విచారణ కోరడం అంటే నమ్మినోళ్లను నట్టేట ముంచడమేనని ఆమె మండిపడ్డారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత, కేటీఆర్ తీరుపై పదునైన విమర్శలు గుప్పించారు.

సాటి మనుషులకు సాయం చేసిన వారిని, బంధువులను ఇబ్బంది పెట్టడం కేటీఆర్‌కు అలవాటుగా మారిందని, చివరికి ఇంటి మనిషినైనా సరే కిరాయి మనుషులతో తిట్టించే నైజం ఆయన సొంతమని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిమ శ్రీనివాసరావుపై విచారణ కోరుతూ కేటీఆర్ లేఖ రాయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కేటీఆర్ సొంత మనుషులపైనే ఉడుకు నీళ్లు పోసే మనస్తత్వం కలిగిన వ్యక్తని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రతిమ శ్రీనివాస్‌ను రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించిన కవిత, ఖైరతాబాద్‌లో బలమైన అభ్యర్థిని పోటీలో నిలపబోతున్నామని స్పష్టం చేశారు.

అలాగే, గత గ్లోబల్ సమిట్‌లో రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చాయో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, లేకపోతే సమిట్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం షేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో కల్వకుంట్ల కవిత పాల్గొని మహిళలతో కలసి సందడి చేశారు.