Private Hospitals: వైద్యం అంటే ఒకప్పుడు ప్రాణదానం.. కానీ నేటి ప్రైవేటు దవాఖానాల్లో అది కేవలం ‘ధన దాహం’! ప్రాణం నిలిపేందుకు వైద్యుడి వద్దకు వస్తే, జేబులు ఖాళీ చేసి, వెంటిలేటర్లపై శవాలను పెట్టి కూడా బిల్లులు వసూలు చేసే నిర్దయ వైఖరి రాజ్యమేలుతోంది. నికార్సైన వైద్యం అందించే కొన్ని మినహాయింపు సంస్థలను పక్కన పెడితే, అధిపత్యం వహిస్తున్న మెజారిటీ ప్రైవేటు ఆసుపత్రులు వ్యాపార నిలయాలుగా మారి రోగుల రక్తమాంసాలను బోంచేస్తున్నాయి. ఏటా వేల కోట్లు కొల్లగొడుతూ మానవతా దృక్పథాన్ని మట్టిలో పాతరేస్తున్న ఈ వ్యవస్థీకృత దోపిడీని ప్రశ్నించే నాథుడే కరువయ్యాడు.
కనపడని నిఘా.. కట్టడి లేని అరాచకం
సామాన్యుడి ఆరోగ్య అత్యవసర పరిస్థితే వీరికి పెట్టుబడి! లేని రోగాలను ఉన్నట్లు సృష్టించడం, అనవసరమైన ల్యాబ్ పరీక్షలు రాయడం, చివరికి గంటల వ్యవధిలోనే లక్షల రూపాయల బిల్లుల నమూనాలను తయారు చేసి ఐసీయూల పేరుతో బందీలను చేయడం ప్రైవేటు దవాఖానాల నిత్యకృత్యమైంది. వీటిని కట్టడి చేయాల్సిన యంత్రాంగాలు చేష్టలుడిగి చూస్తుండటంతో వీరి అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. చట్టాలు చేసే నేతల నుంచి చట్టాన్ని కాపాడాల్సిన రక్షణ వ్యవస్థల వరకు ఈ అనైతిక సామ్రాజ్యంలో భాగస్వాములుగా మారారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
లంచావతారాల్లో డీఎంహెచ్ఓలు.. లాలూచీ రాజకీయం
అనుమతులు లేని క్లినిక్లు, అర్హతల్లేని వైద్యులతో నడిచే దవాఖానాల నుంచి నెలనెలా మామూళ్లు పుచ్చుకుంటూ జీవిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల (DMHO) కక్కుర్తి ఈ దోపిడీకి ప్రధాన కారణం. లంచం ఇస్తే ఎలాంటి నాణ్యత లేని దవాఖానాకైనా పచ్చజెండా ఊపేస్తూ, నిబంధనలు ఉల్లంఘించినా కళ్లున్న కబోదుల్లా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే పలువురు డీఎంహెచ్ఓలు, అధికారులు ఏసీబీకి దొరికిపోవడం ఈ లంచావతారాల వ్యవస్థీకృత దోపిడీకి ప్రత్యక్ష నిదర్శనం.
ఇంకెన్నాళ్లీ అరాచకాలు? రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు వ్యాపారులపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఉక్కుపాదం మోపకపోతే సామాన్యుడికి దక్కేది శవపేటికే తప్ప శ్రేయస్సు కాదనే నిజం సమాజాన్ని భయపెడుతోంది.
