హైదరాబాద్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. మండీ బిర్యానీ తిని 9 మందికి సీరియస్!

Mandi Biryani

Mandi Biryani

Mandi Biryani: నగరంలో కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో గల ‘ముక్రం హోటల్’ నుంచి తెప్పించుకున్న మండీ బిర్యానీ తిని ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఐదుగురు ఏడేళ్లలోపు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఆస్పత్రిలో చికిత్స – మహిళ పరిస్థితి విషమం

బాధితుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అంబర్‌పేటకు చెందిన ఒక కుటుంబం ఈ నెల 15న ముక్రం హోటల్ నుంచి మండీ బిర్యానీ తెప్పించుకుని బంధువులతో కలిసి భోజనం చేశారు. తిన్న కొద్దిసేపటికే తొమ్మిది మందికి తీవ్రమైన వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో ఆగ్రహించిన బాధితులు, బంధువులు హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు.

మొదట స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, బాధితుల్లో ఒక మహిళకు న్యూరో సంబంధిత సమస్య ఉండి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, వైద్యులు బాధితులందరినీ మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. హోటళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.