ponnam prabhakar: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను రద్దు చేయం!

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను రద్దు చేయం

సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

మినిట్ 2 మినిట్, హైదరాబాద్(ఆగస్ట్ 18): తెలంగాణలో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ పరిస్థితిలోనూ ఈ పథకాలను ఆపేది లేదని, పేదలకు అండగా పథకాలను కొనసాగించి తీరుతామని భరోసా ఇచ్చారు.

ఈ పథకాలకు సంబంధించిన 8 జీవోలపై హైకోర్టు ఈ నెల 12న మధ్యంతర స్టే విధించగా, సెప్టెంబర్ 9 వరకు వేచి చూడకుండా స్టేను వెంటనే తొలగించేందుకు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయిస్తున్నట్లు వెల్లడించారు. 2014లో గత ప్రభుత్వం ఇచ్చిన లోపభూయిష్టమైన జీవోల వల్లే ఇప్పుడు చట్టపరమైన ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు. కోర్టులో కౌంటర్ దాఖలు చేయడంలో జరిగిన ఆలస్యంపై అంతర్గత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్-162 ప్రకారం లభించిన కార్యనిర్వాహక అధికారాలతో, శాసనసభ ఆమోదించిన నిధులతోనే ఈ పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు ఈ పథకాల కింద మొత్తం 16,78,347 మంది లబ్ధిదారులకు రూ.16,375.87 కోట్లు అందించినట్లు కోర్టుకు తెలిపిన వివరాలను వెల్లడించారు. చట్టపరమైన అవరోధాలను త్వరలోనే దాటుకుని పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.