VRK Diet: ప్రముఖ సోషల్ మీడియా ప్రచారకుడు వీరమాచినేని రామకృష్ణ (వీఆర్‌కే), ఆయనతో పాటు డాక్టర్‌గా చలామణి అవుతున్న కోటేశ్వరరావులపై సైబరాబాద్ పోలీసులు తీవ్రమైన కేసులు నమోదు చేశారు. నకిలీ వైద్యం, మోసం పేరిట వీరిద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బాధితుడైన 30 ఏళ్ల లా విద్యార్థి కథనం ప్రకారం.. తీవ్రమైన టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న అతడు వీరమాచినేని డయట్ విధానాన్ని ఆశ్రయించాడు.
ఈ క్రమంలో టైప్-1 డయాబెటిస్‌ను తమ డయట్ ద్వారా శాశ్వతంగా నయం చేయవచ్చని నమ్మించిన సదరు వ్యక్తులు, ఇన్సులిన్ వాడటం తక్షణమే ఆపేయాలని సలహా ఇచ్చారు. సప్లిమెంట్లు, ఇతర సేవల పేరిట రూ.26 వేలు వసూలు చేశారు. వారు చెప్పిన మాటలు నమ్మి ఇన్సులిన్ వాడటం నిలిపివేసిన రెండు రోజులకే సదరు విద్యార్థి తీవ్రమైన డీహైడ్రేషన్, డయాబెటిక్ కేటోయాసిడోసిస్ బారినపడి అత్యవసరంగా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.
పరిస్థితి విషమించడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మానవ ప్రాణాలను ప్రమాదంలో పడేయడం, క్రిమినల్ కుట్ర, మోసం వంటి తీవ్రమైన అభియోగాలతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం కింద సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పరి పరి విధాలుగా ప్రాణాలమీదికి తెచ్చినందుకు పరిహారం చెల్లించాలని బాధితుడు నాంపల్లి వినియోగదారుల కోర్టును కూడా ఆశ్రయించాడు. ప్రస్తుతం దీనిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
