“నరమేధంతో సమానం..” కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Drug Markup

Drug Markup

Drug Markup: దేశంలో కార్పొరేట్ ఆస్పత్రులు, ఫార్మా రంగాలు సాగిస్తున్న అడ్డగోలు దోపిడీ విధానాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల మందులపై ఏకంగా పది రెట్లు అధిక ధరలు వసూలు చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఇది కేవలం సాధారణ దోపిడీ కాదని, స్పష్టమైన నరమేధం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం మందుల ధరలపై దాఖలైన పిటిషన్‌‌పై మంగళవారం విచారణ చేపట్టింది.

ఒక క్యాన్సర్ మందు రిటైలర్లకు కేవలం రూ.2,700కే సరఫరా అవుతుంటే, అదే మందును కార్పొరేట్ ఆస్పత్రులు, ఫార్మసీలు ఎంఆర్‌పీ పేరిట ఏకంగా రూ.27,000లకు విక్రయిస్తున్నాయని కోర్టు ముందుకొచ్చిన వివరాలు వెల్లడించాయి. రిటైలర్ ధరకూ, తుది వినియోగదారునికి అమ్మే ధరకూ మధ్య ఇంత భారీ వ్యత్యాసం ఉండటం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. కార్పొరేట్ దవాఖానాలు ఎవరినీ వదిలిపెట్టడం లేదని, బిల్లులు కట్టకపోతే వ్యక్తి చనిపోయినా కనీసం మృతదేహాన్ని కూడా బయటకు వెళ్లనివ్వని దారుణ పరిస్థితులు సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

మరోవైపు ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద చికిత్స పొందే రోగులకు ఇలా అధిక ధరలకు మందులు విక్రయించడం వల్ల ప్రజాధనం తీవ్రంగా దుర్వినియోగం అవుతోందని ధర్మాసనం పేర్కొంది. పన్ను చెల్లించే సామాన్య ప్రజల సొమ్మే చివరికి ఆస్పత్రుల పలారమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రకాల మందులపై ఒకేరీతిగా గరిష్టంగా 16 శాతం మార్జిన్ మాత్రమే ఉండేలా స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ అంశంపై పూర్తి దృష్టి సారించి తగిన సమతుల్యత తీసుకువస్తామని కోర్టుకు విన్నవించారు.