జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షాక్.. సహాయ నిరాకరణకు పిలుపు!

Jani Master

Jani Master

Jani Master:  ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనకు సహాయ నిరాకరణ (నాన్ కో-ఆపరేషన్) అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫెడరేషన్ తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని అన్ని అనుబంధ సంఘాలు, నాయకులు, సభ్యులు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. జానీ మాస్టర్‌తో ఎలాంటి సహకారం అందించవద్దని, ఈ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఫెడరేషన్ పేర్కొంది.

సెప్టెంబర్ 26, 27 తేదీల్లో జరిగిన ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ (AIFEC) సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు లేఖలో వెల్లడించారు. గతంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఫెడరేషన్ నాయకులతో సమగ్రంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఫెడరేషన్ సభ్యుల హక్కులను, ప్రయోజనాలను కాపాడేందుకు, ఎవరికీ అన్యాయం జరగకుండా చూసేందుకే జానీ మాస్టర్‌పై నాన్ కో-ఆపరేషన్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు, AIFEC సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు లభించినట్లు ఫెడరేషన్ స్పష్టం చేసింది. వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా, పారిశ్రామిక నిబంధనలు కాపాడేందుకు ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయాలను ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందేనని సూచించారు. సహాయ నిరాకరణ ఉత్తర్వులతో సినీ పరిశ్రమ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.