ఎట్టకేలకు తెలుగులోకి ‘హనుమాన్ అంశ్‌’.. అక్టోబర్ 9న గ్రాండ్ రిలీజ్!

Hanuman Ansh

Hanuman Ansh

Hanuman Ansh: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కంటెంట్ ఉంటే చాలు, చిన్న సినిమాలైనా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించగలవని మరోసారి నిరూపితమైంది. కేవలం రూ. 1.8 కోట్ల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్‌’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షకిక్ చేస్తోంది. ఎలాంటి భారీ హంగులు, ముందస్తు అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల మార్క్‌ను దాటేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రావడానికి సర్వం సిద్ధం చేసుకుంది.

తెలుగు వెర్షన్ విడుదలపై క్లారిటీ ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్

నిజానికి ఈ సినిమా తెలుగు వెర్షన్‌ సెప్టెంబర్ 18నే విడుదల కావాల్సి ఉంది. అప్పట్లో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు చెందిన ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ ఈ తెలుగు వెర్షన్‌ను సమర్పించనుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలుగు టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో డీల్ కుదరకపోవడంతో త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో తెలుగు రిలీజ్ వాయిదా పడింది. అయితే ఈ గ్యాప్ తర్వాత కన్నడ దిగ్గజ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ రంగంలోకి దిగి, తామే స్వయంగా తెలుగు రిలీజ్ బాధ్యతలను భుజాన వేసుకుంది. ఎట్టకేలకు అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

నీమ్ కరోలి బాబా స్ఫూర్తితో.. అద్భుతమైన ఆధ్యాత్మిక కథాంశం

విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ‘నీమ్ కరోలి బాబా’ జీవితమే ప్రధాన ప్రేరణ. లక్ష్మీ నారాయణ్ అనే సాధారణ వ్యక్తి తన లౌకిక జీవితాన్ని వదిలి, పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచి ఒక గొప్ప సాధువుగా ఎలా రూపాంతరం చెందారనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఈ చిత్రంలో నీమ్ కరోలి బాబా పాత్రలో శోభినవ్ సత్యా తన అద్భుతమైన నటనతో ప్రాణం పోశారు. వీరితో పాటు విహాన్ షెదెగే, పూర్ణిమ తివారీ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమా పెద్ద విజయం

సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలే వందల కోట్ల కలెక్షన్లను సాధించడం చూస్తుంటాం. కానీ, కేవలం రూ. 1.8 కోట్ల వ్యయంతో రూపొందిన ‘హనుమాన్ అంశ్‌’ మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. సెప్టెంబర్ 28 నాటికి ఈ సినిమా కేవలం భారత్‌లోనే రూ. 300 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని తాకింది. సినిమా విడుదలైన 52వ రోజు కూడా ఈ రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వస్తుండటంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 9న థియేటర్లలోకి రానున్న ఈ ఆధ్యాత్మిక దృశ్యకావ్యాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎంతవరకు ఆసక్తి చూపుతారో వేచి చూడాలి.