Mahatma Gandhi: కాలం.. ప్రవాహంలా సాగిపోతుంది. తరాలు మారుతుంటాయి. కానీ కొన్ని వ్యక్తిత్వాలు మాత్రం యుగయుగాల పాటు చెక్కుచెదరని హిమవత్ శిఖరాల్లా నిలిచిపోతాయి. ఆ కోవలోనే, ఆయుధాల గర్జనల ముందు ఆత్మశక్తితో నిలబడి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోసిన ఏకైక యుగపురుషుడు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. నేడు మహాత్ముడి 157వ జయంతి. అయితే ఆయనకు అంజలి ఘటించే వారికంటే, విమర్శించే వారే ఎక్కువైన సందర్భం ఇది. కానీ ఆయన భావజాలం కేవలం నిన్నటి చరిత్ర పుటలకే పరిమితం కాలేదని.. నేటికీ, ఏనాటికీ నవసమాజానికి మార్గదర్శకంగా నిలిచే నిత్యనూతన సిద్ధాంతమని గ్రహించాల్సిన చారిత్రక ఘట్టం ఇది.
నేటి డిజిటల్ యుగంలో కొందరు యువకులు అరకొర జ్ఞానంతో, సామాజిక మాధ్యమాల్లో వ్యాపించే అవాస్తవాలను నమ్మి మహాత్ముని పవిత్రతను శంకించే దుస్సాహసానికి ఒడిగడుతున్నారు. సత్యాగ్రహంతో స్వేచ్ఛ సాధ్యం కాలేదని, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి విప్లవ వీరుల త్యాగాలకు గాంధీజీ వైఖరి విరుద్ధమని పొరబడుతున్నారు. కానీ, చారిత్రక ఆధారాలను నిష్పక్షపాతంగా శోధిస్తే.. మార్గాలు వేరైనా సమర యోధులందరి అంతిమ లక్ష్యం భారతమాత శృంఖలాలను తెంచడమే. నేతాజీ లాంటి విప్లవ వీరుడే స్వయంగా గాంధీజీని ‘జాతిపిత’ అని సగౌరవంగా సంబోధిస్తూ ఆయన ఆశీస్సులను కోరారంటే, బాపూజీ సంకల్ప బలం ఎంతటి మహత్తరమైనదో అర్థమవుతుంది. అహింస అంటే చేతకానితనం కాదని, అది ఆత్మవిశ్వాసానికి పరాకాష్ట అని నిరూపించిన మహానాయకుడు ఆయన.
గాంధీజీ ఆలోచనా తరంగాలు భారత సరిహద్దులను దాటి భూగోళమంతటా వ్యాపించాయి. అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం ఉద్యమించిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నుంచి, దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష రాక్షసత్వాన్ని అంతమొందించిన నెల్సన్ మండేలా వరకు జగత్ విఖ్యాతులందరూ మహాత్ముని శాంతియుత సత్యాగ్రహ మార్గాన్నే తమ ఆయుధంగా మలుచుకున్నారు. ఆఖరికి నేడు సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ను తమ సిద్ధాంతాలకు ఐకాన్‌గా ప్రకటిస్తున్న కేంద్ర పాలకులు సైతం, గాంధీజీ ఆచరించి చూపిన పరిపాలనా సూత్రాలకే అగ్రతాంబూలం ఇస్తున్నారు. నాటి బాపూజీ పారిశుధ్య నినాదమే నేటి ‘స్వచ్ఛ భారత్’గా అవతరించగా, నూలు వడుకుతూ ఆయన నేర్పిన స్వదేశీ పాఠమే నేడు ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది.
శ్రీరాముని దివ్య నామాన్ని హృదయమంతటిలో నింపుకుని, “ఈశ్వర్ అల్లా తేరో నామ్.. సబ్కో సన్మతి దే భగవాన్” అంటూ మానవత్వమే తన మతంగా జీవించిన మహోన్నత ఆధ్యాత్మిక మూర్తి ఆయన. ఆహార నియమాలు, సమయపాలన, కఠోర సాధన, ప్రతిరోజూ నిరంతర నడక, భాషలపై పట్టు, స్వయంకృషితో తన జీవితాన్ని ఒక బహిరంగ గ్రంథంగా తీర్చిదిద్దారు. అందుకే విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ “ఇలాంటి రక్తమాంసాలు కలిగిన ఒక వ్యక్తి నిజంగా ఈ నేలపై నడిచాడంటే రాబోయే తరాలు అసలు నమ్మలేవు” అని అన్నాడు.
హింస, విద్వేషం, ఆవేశాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో గాంధీజీ చూపిన శాంతి, సత్యం, అహింస అనే మార్గాలే మానవాళిని రక్షించే దివ్యౌషధాలు. గాంధీ అనేది కేవలం ఒక పేరు కాదు.. అది ఒక జీవన విధానం, ఒక భావజాలం, భారతదేశపు ఆత్మ! ఆ ఆత్మను గౌరవిస్తూ ముందుకు సాగడమే మనం ఆ మహానీయునికి అర్పించే నిజమైన నివాళి!
