ఇందిరమ్మ ఇళ్లు కావాలంటే.. కాంగ్రెస్ కండువా కప్పుకోవాలా? రాజోలి గ్రామసభలో రాజకీయ దుమారం

Rajoli Gram Sabha

Rajoli Gram Sabha

Rajoli Gram Sabha:  జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో రాజకీయ వివాదం చోటుచేసుకుంది. గ్రామసభలో కాంగ్రెస్ నాయకులు ప్రజలను రాజకీయంగా ఒత్తిడి చేశారంటూ బీజేపీ నాయకులు ఆరోపించారు. జిల్లా ఉపాధ్యక్షుడు సంఘాల సంజీవరెడ్డి, రాజోలి మండల అధ్యక్షుడు కనికే శశికుమార్ గ్రామసభలో పాల్గొని ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

గ్రామసభ వేదికపై అధికారుల సమక్షంలోనే కొందరు కాంగ్రెస్ నాయకులు “కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి పనులు చేస్తాం” అంటూ మాట్లాడారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ పథకాలను పార్టీ రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని వారు పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ సంక్షేమ పథకమని, అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూరాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గ్రామసభలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో రికార్డులను పరిశీలించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను కోరారు.

ఈ అంశంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో రాజకీయ వివక్షకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు, గ్రామసభలో కాంగ్రెస్ నాయకులపై చేసిన ఆరోపణలపై అధికారికంగా స్పందన వెలువడాల్సి ఉంది.