custody tragedy: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరంలో జరిగిన ఒక అత్యంత విషాదకర ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చైల్డ్ కస్టడీ వివాదంలో కోర్టు ఇచ్చిన తీర్పుతో తీవ్ర మనోవేదనకు గురైన ఒక తల్లి, తన కంటికి రెప్పలా చూసుకునే నాలుగు సంవత్సరాల కుమార్తెను ప్రాణం తీసి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది. మానవ సంబంధాల విలువను ప్రశ్నార్థకం చేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కోర్టులో ప్రతికూల తీర్పు.. మారిన పరిస్థితులు
హ్యూస్టన్‌కు చెందిన సిబెల్లా సెవెల్లా (35), ఆరోన్ సెవెల్లా దంపతులకు నాలుగేళ్ల కుమార్తె వివియన్ ఉంది. గడిచిన కొంతకాలంగా వీరు ఇద్దరూ వ్యక్తిగత విభేదాల కారణంగా విడిపోయి, చైల్డ్ కస్టడీ కోసం న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం కోర్టులో తుది విచారణ జరిగిందని, అయితే తీర్పు తల్లి సిబెల్లాకు వ్యతిరేకంగా వచ్చిందని హ్యూస్టన్ పోలీసులు వెల్లడించారు.
తండ్రికి ప్రాథమిక కస్టడీ అప్పగింత
పాప వివియన్ ప్రాథమిక కస్టడీని తండ్రి ఆరోన్ సెవెల్లాకు ఇస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. అంతేకాకుండా, తల్లి సిబెల్లా కేవలం పర్యవేక్షణలో మాత్రమే కుమార్తెను చూసేందుకు వీలుంటుందని, ఇతర నిబంధనలు కూడా కఠినంగా వర్తిస్తాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చట్టపరమైన ఈ పరిణామాలు, ముఖ్యంగా తన బిడ్డను దూరం పెడుతున్నారనే నిరాశ ఆ తల్లిని తీవ్రమైన మానసిక అశాంతిలోకి నెట్టాయి.
క్షణికావేశంలో అఘాయిత్యం.. ముగిసిన నిండు ప్రాణాలు
కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల వ్యవధిలోనే సిబెల్లా తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. కోర్టు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తక్షణమే ఆమె ఇంట్లోని తుపాకీతో తన నాలుగేళ్ల కూతురు వివియన్‌ను కాల్చి చంపింది. ఆ తర్వాత అదే తుపాకీతో తానూ కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర గాయాలపాలైన సిబెల్లాను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ హృదయ విదారక ఉదంతం ఇరు కుటుంబాల్లోను, సమాజంలోను తీవ్ర విషదాన్ని నింపింది.
