– రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత.. ఈక్వెడార్‌లోనూ ప్రకంపనలు
– తీవ్రంగా దెబ్బతిన్న భవనాలు, మౌలిక వసతులు
మినిట్ 2 మినిట్, ఇంటర్నెట్ డెస్క్ (ఆగస్ట్ 11): దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో మంగళవారం భారీ భూకంపం తీవ్ర భయాందోళన సృష్టించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది. ఈ భూకంప ధాటికి ఇప్పటివరకు 69 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. పొరుగు దేశమైన ఈక్వెడార్‌లోనూ బలమైన ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు.
కొలంబియా రాజధాని బొగోటాకు పశ్చిమాన సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘శాన్ జోస్ డెల్ పాల్యార్’ ప్రాంతంలో, భూమికి 107 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ధృవీకరించింది. భూకంప ప్రభావం వల్ల పెరీరా, క్విబ్డో, కాలి, మనిజాలెస్ వంటి ప్రధాన నగరాల్లో భవనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. కొలంబియా వ్యాప్తంగా 20కి పైగా మున్సిపాలిటీల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు స్థానిక గవర్నర్ నుబియా కార్డోబా తెలిపారు.
ప్రస్తుతం సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి, కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నాయి. రాజధాని బొగోటాతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
