Care College: మన్సూరాబాద్లోని కేర్ నర్సింగ్ కాలేజీలో కొందరు యువకులు దౌర్జన్యానికి దిగి, భౌతిక దాడులు, విధ్వంసం సృష్టించిన ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల పాటు వరుసగా కళాశాల ప్రాంగణంలోకి ప్రవేశించి, అరాచకం సృష్టించడంతో విద్యార్థులు, మహిళా సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారని ఫిర్యాదులో యాజమాన్యం పేర్కొంది.
పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక కేర్ నర్సింగ్ కాలేజ్లోకి సి. రంజిత్ కుమార్, సి. చైతన్య, బి. జయరాం, వి. భవానీశంకర్, కె. ప్రమోద్ రెడ్డి అనే యువకులు మంగళవారం ఉదయం ప్రవేశించి మహిళా సిబ్బందిని దూషించి, విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశారు. తిరిగి బుధవారం ఉదయం కూడా అదే యువకులు మరికొందరితో కలిసి కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్లోని కంప్యూటర్లు, లైబ్రరీ, గ్లాస్ అద్దాలు, ఫ్లవర్ పాట్లను తీవ్రంగా ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా మహిళా సిబ్బందిపై దాడికి తెగబడి, అసభ్య పదజాలంతో దూషిస్తూ ‘జై ఎన్ఎస్యూఐ’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. వరుసగా రెండు రోజుల పాటు కళాశాలపై పడి విధ్వంసానికి పాల్పడిన యువకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్ బి. సునీత ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, సదరు యువకులను రిమాండ్కు తరలించారని సమాచారం.
