వ్యాపార ‘వెలుగుల’ వెనుక జర్నలిజం చీకట్లు.. పత్రికారంగం విలువల పునరుద్ధరణ సాధ్యమేనా?

Media Ethics

Media Ethics

Media Ethics:  ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలలో ఒకటైన పత్రికారంగం స్వరూపం, శైలి కాలంతో పాటు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు కేవలం ప్రజా సమస్యలు, నిజాయితీతో కూడిన వార్తల విశ్లేషణకే పరిమితమైన సమాచార వ్యవస్థ.. నేడు మారుతున్న సాంకేతికత, వ్యాపార నమూనాలకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. అయితే ఈ మార్పుల క్రమంలో వార్తల్లోని సహజత్వం, నిష్పాక్షికత తగ్గి.. వ్యాపార ప్రయోజనాలు,  పెరిగిపోతున్నాయన్న అభిప్రాయం సామాజిక మేధావులు, విశ్లేషకుల నుంచి బలంగా వినిపిస్తోంది.

మహాకవి శ్రీశ్రీ ఆనాడే పత్రికల తీరును నిరసిస్తూ “పత్రికలు.. పెట్టుబడిదారుల విష పుత్రికలు” అని స్పష్టంగా చెప్పారు. ఆ వ్యాఖ్యలు నేటి డిజిటల్, టీవీ మీడియా యుగంలో అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి. సర్కస్ రింగ్‌లో మాస్టర్ ఏది ఆడిస్తే జనం దాన్నే చూసినట్లు.. మీడియా రంగంలోనూ యాజమాన్యాలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కలిసి ఆడిస్తున్న నాటకాన్నే వీక్షకులు చూడాల్సిన దుస్థితి దాపరించింది. ఒకప్పుడు ప్రజాసమస్యలను నిలదీసే గొంతుకగా ఉన్న పత్రికారంగం.. నేడు కార్పొరేట్ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. ప్రస్తుత వార్తా ప్రసారాలలో దృశ్య మాధ్యమాల ప్రాధాన్యం పెరుగుతున్న కొద్దీ, సమాచారాన్ని అందించే విధానం కంటే వీక్షకులను ఆకట్టుకునేందుకు చేసే హడావుడే ఎక్కువగా కనిపిస్తోందనే విమర్శలు ఉన్నాయి. రేటింగ్స్, క్లిక్‌ల వేటలో అసలైన ప్రజా సమస్యలు, కీలకమైన ప్రాధాన్యతా అంశాలు వెనుకబడిపోతుండగా.. తాత్కాలిక సంచలనాలకు, కల్పిత కథనాలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందన్నది పత్రికారంగంలో స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవం.

కార్పొరేట్ శక్తులు, వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రాధాన్యతలు పెనవేసుకుపోయిన ప్రస్తుత వాతావరణంలో మీడియా తన మూల సూత్రాలైన నిష్పాక్షికత, సామాజిక బాధ్యతలను కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. కడుపు మండిన సామాన్యుడి గొంతును, నిరుద్యోగితను, ధరల మంటను ఎలుగెత్తి చాటాల్సిన వేదికలు.. స్వార్థ ప్రయోజనాల కోసం నిజాలను సమాధి చేస్తున్నాయి. వార్తలను ‘వ్యాపారం’గా, జర్నలిజాన్ని ‘ప్రదర్శన’గా మార్చిన ఈ పోకడల పట్ల జనం మేల్కొనాల్సిన సమయం వచ్చింది. నాణ్యమైన, నిష్పాక్షికమైన పాత్రికేయ విలువలను కాపాడుకోవడం నేటి సమాజం ముందున్న పెద్ద సవాలు. సమాజ హితమే పరమావధిగా సాగాల్సిన మీడియా ప్రయాణంలో వినోదం, వ్యాపార వ్యామోహాల కంటే ప్రజల గొంతుకగా నిలవడమే నిజమైన పాత్రికేయ ధర్మం. మారుతున్న సమాచార వ్యవస్థల పోకడలపై, పత్రికారంగ విలువల పునరుద్ధరణపై విస్తృతమైన సామాజిక మథనం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.