సైబర్ బాధితులకు ఊరట లభించేలా విండో డెస్క్.. తెలంగాణ డీజీపీని కలిసిన హైకోర్టు అడ్వకేట్!

Cyber Crime

Cyber Crime

Cyber Crime: సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తోందో, దాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరాలు చేసే వారి సంఖ్య కూడా అంతే తీవ్రంగా పెరుగుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో సృష్టిస్తున్న ‘డీప్‌ఫేక్’ వీడియోలు, మార్ఫింగ్ కంటెంట్ సమాజంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరొకవైపు, ఏ పాపం ఎరుగని సాధారణ పౌరుల బ్యాంక్ ఖాతాలు ఆకస్మికంగా ఫ్రీజ్ కావడం వల్ల ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రెండు ప్రధాన సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్‌ను కలిసి హైకోర్టు న్యాయవాది, భాజపా నాయకుడు పోతిరెడ్డి కృష్ణకాంత్ వినతిపత్రం సమర్పించారు.

ఏఐ డీప్‌ఫేక్స్ కట్టడికి ప్రత్యేక రెస్పాన్స్ సెల్

రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కృషి చేస్తున్నప్పటికీ, ఏఐ ద్వారా సృష్టిస్తున్న డీప్‌ఫేక్ కంటెంట్ కొత్త సవాళ్లను విసురుతోందని కృష్ణకాంత్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, మహిళలు, ఆర్మీ అధికారుల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని అసత్య ఏఐ వీడియోలను వ్యాప్తి చేసిన ఘటనలు వెలుగుచూశాయి. ఇలాంటి డిజిటల్ దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు బ్యూరో పరిధిలో ప్రత్యేక ‘సైబర్ అబ్యూజ్ అండ్ డీప్‌ఫేక్ రెస్పాన్స్ సెల్’ ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ‘షీ టీమ్స్’ భాగస్వామ్యంతో ప్రత్యేక డెస్క్, అలాగే అసత్య కంటెంట్‌ను గంటల వ్యవధిలోనే సోషల్ మీడియా వేదికల నుండి తొలగించేలా (Take-down protocol) కఠిన నిబంధనలు తీసుకురావాలని కోరారు. అయితే, భావప్రకటనా స్వేచ్ఛ మరియు చట్టబద్ధమైన విమర్శలకు దీనితో ఎలాంటి భంగం కలగకూడదని స్పష్టం చేశారు.

నిరపరాధుల బ్యాంక్ ఖాతాల అన్‌ఫ్రీజ్‌కు ‘సింగిల్ విండో డెస్క్’

మరొక తీవ్రమైన సమస్య ‘త్రోవ మళ్లిన సైబర్ లీన్ ప్రాసెస్’. ఎవరో చేసిన సైబర్ నేరాల దర్యాప్తులో భాగంగా, ఎలాంటి సంబంధం లేని సాధారణ పౌరులు, వ్యాపారులు, ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను సైబర్ పోలీసులు సడన్‌గా ఫ్రీజ్ చేస్తున్నారని తెలిపారు. తమ జీతాలు, వ్యాపార చెల్లింపులు, కుటుంబ అత్యవసరాల కోసం వచ్చిన సొమ్మును కూడా వాడుకోలేక వేలాదిమంది బాధితులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని వివరించారు. సరైన మేజిస్ట్రేట్ ఉత్తర్వులు లేకుండా ఖాతాలు పూర్తిగా సీజ్ చేయడం రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరా యడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ‘కనకాటి నరేష్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పును ఈ సందర్భంగా గుర్తుచేశారు.

బాధితులకు త్వరిత ఉపశమనం – అధికారులకు సహకారం

ఈ సమస్యల పరిష్కారానికి సైబర్ బ్యూరో పరిధిలోనే ఒక ‘థర్డ్-పార్టీ అకౌంట్ అన్‌ఫ్రీజ్ డెస్క్’ను ప్రారంభించాలని కృష్ణకాంత్ ప్రతిపాదించారు. అనుమానాస్పద ఖాతాలపై ఫిర్యాదు రాగానే, కేవలం ఆ వివాదాస్పద మొత్తానికే ‘లీన్’ (పట్టు) పరిమితం చేయాలని, మొత్తం అకౌంట్‌ను లాక్ చేయకూడదని కోరారు. బాధితుల దరఖాస్తులను స్వీకరించి 48 గంటల్లో సమాధానం ఇస్తూ, ఏడు పనిదినాల్లో నిర్ణయం తీసుకునేలా స్పష్టమైన మార్గదర్శకాలు (SOP) ఉండాలని కోరారు. ఈ విధానాల రూపకల్పనలో పోలీసు శాఖకు చట్టపరమైన సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వినతిపత్రం స్వీకరించిన డీజీపీ సి.వి. ఆనంద్ స్పందిస్తూ, ఈ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.