Foster Reunion: రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ, అంతులేని ఆవేదన తర్వాత దత్తత వివాదంలో చిక్కుకున్న మూడేళ్ల పసికందు ఎట్టకేలకు తనకు మూడేళ్లుగా ఆప్యాయత పంచిన పెంపుడు తల్లిదండ్రుల ఒడికి చేరుకున్నాడు. చట్టపరమైన అనుమతులు, పరిపాలనాపరమైన చిక్కుల వల్ల కరీంనగర్ శిశు సంరక్షణ కేంద్రానికే పరిమితమైన ఆ బాలుడిని అధికారులు సరిత, శ్రీనివాస్ దంపతులకు అప్పగించడంతో ఆ కుటుంబంలో ఆనంద బాష్పాలు వెల్లివిరిశాయి.
జగిత్యాల జిల్లాకు చెందిన సరిత, శ్రీనివాస్ దంపతులకు పిల్లలు లేకపోవడంతో మూడేళ్ల క్రితం ఒక నవజాత శిశువును తెచ్చుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ జరగలేదన్న కారణంతో అధికారులు చిన్నారిని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. కంటికి రెప్పలా చూసుకున్న బిడ్డ దూరమవడంతో ఆ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం అక్టోబర్ 16న బాలుడిని పెంపుడు తల్లిదండ్రులకే అప్పగించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సీడబ్ల్యూసీ (CWC) అనుమతులు, ఇతర పాలనాపరమైన కారణాలతో అప్పగింతలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ క్రమంలో శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్న బిడ్డను చూడటానికి వెళ్లిన తల్లిదండ్రులను పట్టుకుని.. “నన్ను అమ్మానాన్నల దగ్గరకు తీసుకెళ్లండి.. ఇక్కడ భయమేస్తోంది” అంటూ బాలుడు బోరున విలపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వైరల్గా మారాయి. ఈ కన్నీటి దృశ్యాలపై పంచాయతీ రాజ్, సీఐడబ్ల్యూ శాఖ మంత్రి సీతక్క తక్షణమే స్పందించి, అధికారులతో మాట్లాడి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశించారు.
మంత్రి ఆదేశాలు, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రక్రియను వేగవంతం చేయడంతో అధికారులు బాలుడిని కరీంనగర్ శిశు సంరక్షణ కేంద్రం నుంచి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. రెండు నెలల తర్వాత తమ కళ్లముందే ఆడుకుంటున్న బిడ్డను చూసి సరిత, శ్రీనివాస్ దంపతులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ బాధను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన మీడియాకు, స్పందించిన మంత్రి సీతక్కకు, కలెక్టర్కు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
