Medical Shops: రాష్ట్రంలో హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ క్రయవిక్రయాలపై, విచ్చలవిడి వాడకంపై తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ వింగ్ (TG SAFE) విభాగాధికారులు, ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్-1940 నిబంధనలను తుంగలో తొక్కుతూ మత్తు కలిగించే మందులను విక్రయిస్తున్న మెడికల్ షాపులపై నిర్వహించిన ఆకస్మిక తనిఖీల అనంతరం, మొత్తం 138 మెడికల్ షాపుల లైసెన్సులను సస్పెండ్ చేస్తూ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అక్టోబర్ 15న నిర్వహించిన ప్రత్యేక తనిఖీల ఆధారంగా చేపట్టిన ఈ చర్యల్లో.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 98 మెడికల్ షాపుల లైసెన్సులను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సస్పెండ్ చేయగా, మరో 40 షాపుల లైసెన్సులను నిర్దిష్ట కాలపరిమితితో సస్పెండ్ చేశారు. అలాగే మరో రెండు మెడికల్ షాపులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అధికారిక ప్రిస్క్రిప్షన్ లేకుండా లేదా క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ అందుబాటులో లేనప్పుడు సైకోట్రోపిక్, షెడ్యూల్ హెచ్/హెచ్1 డ్రగ్స్‌ను అమ్మకూడదని TG SAFE స్పష్టం చేసింది. కొనుగోలు, విక్రయాల రికార్డులను పక్కాగా నిర్వహించకపోతే లైసెన్సుల రద్దుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అక్రమ మందుల విక్రయాలపై ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.
