కాంక్రీట్ అందాల వెనుక కన్నీటి కష్టాలు.. ఎల్‌బీ నగర్ అసలు కథ ఇదేనా?

LB Nagar

LB Nagar

LB Nagar: తూర్పు హైదరాబాద్‌కు సింహద్వారం.. వేలాది కుటుంబాలకు ఆవాసం.. వ్యాపార కాంప్లెక్సులు, బహుళ అంతస్తుల టవర్లు, అధునాతన థియేటర్లతో కళకళలాడే ఎల్‌బీ నగర్ నియోజకవర్గం నిజంగా అభివృద్ధి చెందిందా? పైకి కనిపించే కాంక్రీట్ అందాల వెనుక, సామాన్య ప్రజల నిత్య జీవితం ఎంత దయనీయంగా ఉందో పరిశీలిస్తే ఒకటే ప్రశ్న మిగులుతుంది.. ఎల్‌బీ నగర్ చేసుకున్న పాపం ఏంటి?

హయత్ నగర్, లింగోజీగూడ, గడ్డి అన్నారం, చంపాపేట్, వనస్థలిపురం, హస్తినాపురం, బీఎన్ రెడ్డి నగర్, మన్సూరాబాద్, నాగోల్ మొదలైన 11 డివిజన్లతో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గానికి సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనతో పాటు ప్రజాదరణ పొందిన తాజా మాజీ కార్పొరేటర్లు, ముఖ్యమంత్రుల నుంచి ప్రధానుల వరకు పరిచయాలు ఉన్న హేమాహేమీలైన రాజకీయ నాయకులు ఇక్కడే ఉన్నారు. రెండు జాతీయ పార్టీలు, బలమైన ప్రాంతీయ పార్టీల నేతలకు నిలయమైన ఈ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధుల సుదీర్ఘ అనుభవం ద్వారా ఒరిగింది మాత్రం శూన్యమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ప్రజలు

కాలనీలు, బస్తీల ప్రజల కనీస అవసరాలను పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అడుగుపెడితే ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రోడ్డు సరిగ్గా ఉందా? ఒక్క రోజైనా డ్రైనేజీ నీరు రోడ్లపైకి పొంగకుండా ఉండే కాలనీ ఉందా? భవిష్యత్తు నీటి అవసరాల కోసం ఎన్ని ఇంకుడు గుంతలు నిర్మించారు? యువత, విద్యార్థుల చదువు కోసం ఒక్క పెద్ద ప్రభుత్వ లైబ్రరీ అయినా ఉందా? ఎల్‌బీ నగర్‌లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదా ఇంటర్ కాలేజీ ఎక్కడా? యువత సృజనాత్మకతకు ఊతమిచ్చే యూత్ క్లబ్స్, సీనియర్ సిటిజన్లు కాసేపు ప్రశాంతంగా గడిపే సమావేశ మందిరాలు ఎన్ని ఉన్నాయి?

కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే అభివృద్ధా?

పెద్ద పెద్ద టవర్లు, షాపింగ్ మాల్స్, ఫ్లైఓవర్లు నిర్మించడం మాత్రమే అభివృద్ధి అనిపించుకోదు. బస్తీలు, కాలనీల్లో నివసించే సగటు మనిషి జీవన ప్రమాణాలు మెరుగైనప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమవుతుంది. విద్యా, వైద్యం, గ్రంథాలయాలు, స్వచ్ఛమైన వాతావరణం లాంటి కనీస వసతులు కల్పించకుండా కేవలం కాంక్రీట్ జంగిల్‌గా మార్చడమేనా నాయకులు సాధించిన ప్రగతి?

ఏళ్ల తరబడి ఓట్లేసి గెలిపిస్తున్న ప్రజల ప్రాథమిక అవసరాలను విస్మరిస్తూ, కాలనీల అభివృద్ధిని గాలికి వదిలేసిన నాయకత్వ తీరుపై నియోజకవర్గ వాసులు తిరగబడుతున్నారు. ఇప్పటికైనా పాలకుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చి, ఎల్‌బీ నగర్ రూపురేఖలు నిజమైన రీతిలో మారాలని ఆశిస్తున్నారు.