Karthika Masam 2026: నంద్యాల: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ఆకాశదీపోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు పాల్గొన్నారు. ముందుగా ఆకాశదీపానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్, అర్చకస్వాములు, ఆలయ అధికారులు కలిసి ఆకాశదీపాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. వేదమంత్రాల నడుమ సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.
కార్తీక మాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన మాసం కావడంతో శ్రీశైల క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా దేవస్థానం ప్రత్యేక పూజలు, ఉత్సవాలను నిర్వహిస్తోంది.
కార్తీక మాసం నెలరోజుల పాటు ప్రతిరోజూ అర్చకస్వాములు ఆకాశదీపాన్ని వెలిగించనున్నారు. లోకకల్యాణం, సకల జీవుల శాంతి, సౌభాగ్యం కోసం ఈ దీపారాధన కొనసాగనుంది. శ్రీశైల మల్లన్న సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఆకాశదీపోత్సవం భక్తుల్లో విశేష భక్తిభావాన్ని నింపుతోంది.
