Sabarimala Yatra: శబరిమల అయ్యప్ప స్వామి వార్షిక మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ సమీపిస్తున్న వేళ, యాత్రికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో జరుగుతున్న జాప్యం వివాదాస్పదంగా మారింది. కీలక పనులు ఇంకా పూర్తికాకపోవడంపై ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) నాయకత్వంపై ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. యాత్రా సీజన్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కాంగ్రెస్ మద్దతున్న ట్రావెన్కోర్ దేవస్థానం ఉద్యోగుల సంఘం (ట్రావెన్కోర్ దేవస్థానం ఎంప్లాయీస్ ఫ్రంట్) ఈ అంశంపై స్పందిస్తూ.. యాత్రకు సంబంధించిన మౌలిక వసతుల పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించింది. ముఖ్యమంత్రి నిలక్కల్ పర్యటన సందర్భంగా పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లే రహదారులను తారు రోడ్లుగా మార్చి, వాహనాల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించినప్పటికీ ఇప్పటికీ పలు మార్గాలు బురదమయంగానే ఉన్నాయని పేర్కొంది. అత్యవసర మరమ్మతు పనులు కూడా సకాలంలో పూర్తి కాలేదని విమర్శించింది.
అరవణ ప్లాంట్ పనుల్లోనూ జాప్యం
అరవణ ప్రసాదం తయారీ కేంద్రంలో చేపట్టిన కొత్త నిర్మాణ పనులు గత నెలవారీ పూజల సమయానికే పూర్తికావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని ఉద్యోగ సంఘం వెల్లడించింది. మరోవైపు అరవణ తయారీకి అవసరమైన నెయ్యి నిల్వలు తగ్గిపోతుండటం మరింత ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. అదనపు నెయ్యి కొనుగోలు కోసం చేపట్టాల్సిన టెండర్ ప్రక్రియ కూడా ఇంకా పూర్తికాలేదని పేర్కొంది. దీంతో యాత్రా సీజన్లో అరవణ ప్రసాదం తయారీ, పంపిణీపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
అరవణ తయారీ, నెయ్యి సరఫరా, అప్పం లభ్యత, రవాణా సదుపాయాలు, పారిశుద్ధ్యం, ఉద్యోగులకు ఆహార ఏర్పాట్లలో ఏవైనా అంతరాయాలు ఏర్పడితే అందుకు బోర్డు అధ్యక్షుడు, పాలక మండలే బాధ్యత వహించాలని సంఘం స్పష్టం చేసింది. పరిమిత సదుపాయాల మధ్య కూడా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బోర్డు వైఫల్యాలకు బాధ్యులుగా చేయడం సరికాదని పేర్కొంది.
మూడు లక్షల అరవణ టిన్ల తయారీ ప్రారంభం
మరోవైపు, కొన్ని పనులు ఆలస్యమైన మాట వాస్తవమేనని దేవస్థానం బోర్డు అధికారులు అంగీకరించారు. అయితే యాత్ర ప్రారంభమయ్యేలోగా వాటిని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అరవణ ప్లాంట్ ఆధునికీకరణ పనులు సుమారు 15 రోజులు ఆలస్యమయ్యాయని ఓ అధికారి వెల్లడించారు. దేవస్థానం పీడబ్ల్యూడీ విభాగం నుంచి జరిగిన జాప్యమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు. అయినప్పటికీ పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, సోమవారం నుంచి మూడు లక్షల అరవణ టిన్ల తయారీ ప్రారంభించినట్లు వివరించారు.
ఆన్లైన్ చెల్లింపులపై ఆందోళన
అరవణ ప్రసాదం తయారీతో పాటు పంపిణీ విషయంలోనూ కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. సన్నిధానంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడం, సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల ప్రసాదం విక్రయ కేంద్రాల్లో లావాదేవీలకు అంతరాయం కలగవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సన్నిధానంలో మొత్తం 19 కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, అన్నింటికీ సమీకృత చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే ఈ విధానం దీర్ఘకాలం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుందా అనే సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం సహా పలు సంస్థలు కూడా శబరిమలలో యాత్రా ఏర్పాట్ల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. మొత్తంగా యాత్రా సీజన్ ప్రారంభానికి ముందే రహదారులు, పార్కింగ్, ప్రసాదాల తయారీ, సరఫరా, పారిశుద్ధ్యం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయడం ఇప్పుడు దేవస్థానం బోర్డుకు కీలక సవాలుగా మారింది.
