GHMC Award: కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా నిర్వహించిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26’ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) జాతీయ అవార్డును గెలుచుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం నిర్వహించిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంఏయూడీ సెక్రటరీ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్, అదనపు కమిషనర్ ఎన్. రవికిరణ్‌లతో కలిసి అవార్డును స్వీకరించారు.
నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, ఘన వ్యర్థాల శుద్ధి, మురుగునీటి నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, పౌరుల స్పందన వంటి 10 ప్రధాన విభాగాల్లో 10,500 మార్కులకు గానూ మెరుగైన పనితీరు కనబరిచినందుకు గాను భాగ్యనగరానికి ఈ జాతీయ గుర్తింపు లభించింది. థర్డ్ పార్టీ ఏజెన్సీ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో హైదరాబాద్ మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత ప్రమాణాలు అద్భుతంగా ఉన్నట్లు తేలింది.
గతంలో ఓడీఎఫ్++, వాటర్ ప్లస్ సర్టిఫికేషన్లతో పాటు 7-స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ గుర్తింపు దక్కించుకున్న జీహెచ్ఎంసీ, ఇప్పుడు మరో జాతీయ అవార్డును సొంతం చేసుకోవడం గర్వకారణమని అధికారులు తెలిపారు. అంతేకాకుండా స్వచ్ఛ షెహర్ జోడీ కార్యక్రమంలో భాగంగా మంథని, చేర్యాల మున్సిపాలిటీలకు జీహెచ్ఎంసీ మార్గదర్శిగా వ్యవహరిస్తూ పారిశుద్ధ్య ప్రమాణాల పెంపునకు దోహదపడుతోంది. ఈ అవార్డు హైదరాబాద్‌ను మరింత శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దేందుకు పారిశుద్ధ్య సిబ్బందికి, అధికారులకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని యంత్రాంగం వ్యక్తం చేసింది.
