Sarpanch Election: గ్రామీణ రాజకీయాల్లో యువతరం జోరు పెరుగుతోంది. చదువుకున్న యువతీ యువకులు ప్రజాసేవ లక్ష్యంగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగుతూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకూరుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో 22 ఏళ్ల యువతి శివసాహితీ నిలవడం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పోరుమామిళ్ల టీడీపీ మండల అధ్యక్షుడు భైరవ ప్రసాద్ కుమార్తె అయిన శివసాహితీ, పిన్న వయసులోనే ప్రజాసేవ చేయాలనే ఉత్సాహంతో ఎన్నికల పోరుకు సిద్ధమయ్యారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, తమ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలనే దృఢ సంకల్పంతో ఆమె ముందుకు వచ్చారు. నేటి తరం యువత క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని, వారి ఆధునిక ఆలోచనలు గ్రామాల ప్రగతికి దోహదపడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఆమె అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ఉన్నత విద్యావంతురాలైన శివసాహితీ సర్పంచ్‌గా ఎన్నికైతే టేకూరుపేట పంచాయతీకి నూతన జవసత్వాలు వస్తాయని, గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ పారదర్శకంగా అందుతాయని స్థానికులు, పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మండల ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
