cjp : మరో ఉద్యమానికి సిద్ధం..కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన!

మరో ఉద్యమానికి సిద్ధం!

కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన

విద్యార్థి పోరాటం నుంచి రైతు, సామాజిక అంశాలపై దృష్టి

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యం

రైతు సంఘాలు, విద్యార్థుల ఉమ్మడి పోరాటానికి సీజేఏ చీఫ్ పిలుపు

మినిట్ 2 మినిట్, ఢిల్లీ(ఆగస్ట్ 12): దేశంలో ఇటీవల నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అవకతవకలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు చేపట్టి సంచలనం సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ మరో విడత సుదీర్ఘ ఉద్యమానికి సన్నాహాలు చేస్తోంది. డిజిటల్ మాధ్యమాలు, నిరసన ప్రదర్శనలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఈ యువజన ఉద్యమ వేదిక, ఇప్పుడు తన పోరాట పరిధిని మరిన్ని కీలక సామాజిక అంశాలకు విస్తరించేందుకు వ్యూహరచన చేస్తోంది.

ఈ క్రమంలో సీజేపీ నేత అభిజిత్ దీప్కే ప్రతిపాదిత ప్రణాళికలను వెల్లడిస్తూ, విద్యార్థుల సమస్యలతో పాటు దేశవ్యాప్త రైతు ఇబ్బందులు, నిరుద్యోగం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణపై పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో దేశవ్యాప్త ఆందోళనలకు దిగుతామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు, భారతీయ కిసాన్ యూనియన్ అగ్రనేత రాకేశ్ టికాయత్‌ వంటి రైతు నాయకులతో చర్చలు జరిపిన సీజేపీ బృందం, కనీస మద్దతు ధర చట్టబద్ధత, నిరుద్యోగం, విద్యావ్యవస్థలోని అక్రమాలపై విద్యార్థులు-రైతుల ఉమ్మడి పోరాట వేదికను సిద్ధం చేస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతమైన మద్దతును సమీకరిస్తూ, ప్రత్యక్ష ఆందోళనలతో ప్రభుత్వాన్ని ముట్టడించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. భవిష్యత్తులో ఈ ఉద్యమం దేశ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.