8 నెలలుగా జీతం కట్.. కార్యాలయం ముందే యాచకురాలిగా మారిన RDO అధికారిణి!

bihar officer

bihar officer

bihar officer:  ప్రభుత్వ ఉద్యోగం అంటేనే భద్రత, ప్రతినెలా ఠంచనుగా వచ్చే జీతం అని అంతా భావిస్తారు. కానీ ఓ ఉన్నత స్థాయి మహిళా అధికారిణికి నెలల తరబడి వేతనం అందకపోవడంతో, చివరకు ఆమె తన కార్యాలయం ముందే చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని అడుక్కునే దుస్థితి దాపురించింది. బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ విస్మయకర ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

బిహార్‌లోని బక్సర్ జిల్లా, బ్రహ్మపూర్ బ్లాక్ కార్యాలయంలో అల్పితా సింగ్ అనే మహిళ రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా (RDO) విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఆ కార్యాలయంలో చేరి 11 నెలలు గడుస్తున్నా, కేవలం మొదటి మూడు నెలల జీతం మాత్రమే అందింది. మిగతా 8 నెలలుగా తనకు రావాల్సిన వేతనాన్ని అధికారులు నిలిపివేశారు. జీతం రాకపోయినా తాను ఏనాడూ విధులకు గైర్హాజరు కాకుండా క్రమం తప్పకుండా బాధ్యతలు నిర్వర్తించానని అల్పితా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫైళ్లు ముందుకు కదలకపోవడంతో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో విసిగిపోయిన ఆమె ఈ వినూత్న నిరసనకు దిగారు.

ఓ బాధ్యతాయుతమైన అధికారిణి భిక్షాపాత్రతో కార్యాలయం మెట్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులు, బ్రహ్మపూర్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO), అల్పితా సింగ్ మధ్య ఉన్న పరిపాలనాపరమైన విభేదాల వల్లే జీతం నిలిచిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. తక్షణమే స్పందించిన జిల్లా అధికారులు, జీతం ఎందుకు నిలిపివేశారో వివరణ ఇవ్వాలని సంబంధిత బీడీవోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉద్యోగుల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.