వీడియో కాల్‌లో ‘అరెస్ట్’ బెదిరింపా? అది సైబర్ వల.. అసలు నిజం ఇదే!

Digital Arrest

Digital Arrest

Digital Arrest: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలతో ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న అతిపెద్ద సైబర్ వల ‘డిజిటల్ అరెస్ట్ స్కామ్’ (Digital Arrest Scam). మీ పేరుతో ఏదో పెద్ద నేరం జరిగిందని, డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని లేదా మనీలాండరింగ్ కేసులో మీ బ్యాంక్ ఖాతా ఉందని బెదిరిస్తూ కేటుగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. అచ్చం పోలీసు అధికారులు, సీబీఐ, ఈడీ అధికారుల మాదిరిగా యూనిఫామ్ ధరించి వీడియో కాల్స్ చేస్తూ సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

మోసగాళ్లు విసిరే వల!

సైబర్ నేరగాళ్లు ముందుగా ఫోన్ చేసి, మీ ఆధార్ లేదా ఫోన్ నంబర్‌తో తీవ్రమైన నేరం జరిగిందని నమ్మిస్తారు. ఆ వెంటనే వీడియో కాల్‌లోకి రావాలని ఆదేశిస్తారు. అవతలి వైపు పోలీస్ స్టేషన్ సెటప్, యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తులను చూసి బాధితులు నిజమేనని నమ్ముతారు. విచారణ పూర్తయ్యే వరకు ఎవరితోనూ మాట్లాడకూడదని, గదిలో నుంచి బయటకు రాకూడదని ఆంక్షలు విధిస్తూ వారిని మానసిక ఒత్తిడిలోకి నెడతారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే తక్షణమే తాము చెప్పిన ఖాతాలకు డబ్బులు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తారు. భయాందోళనకు గురైన బాధితులు తమ జీవితకాలపు కష్టార్జితాన్ని నేరగాళ్ల ఖాతాల్లోకి పంపి మోసపోతున్నారు.

అసలు నిజం తెలుసుకోండి!

భారత చట్టాల ప్రకారం ఏ పోలీసు విభాగం గానీ, దర్యాప్తు సంస్థ గానీ వీడియో కాల్స్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయదు. అలాగే అరెస్ట్ నుంచి తప్పించేందుకు ఫోన్ కాల్స్‌లో డబ్బులు అడగదు. ‘డిజిటల్ అరెస్ట్’ అనే పదమే చట్టంలో లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు ఏమాత్రం ఆందోళన చెందకుండా వెంటనే కాల్ కట్ చేయాలి.

సైబర్ ముప్పు నుంచి రక్షణ పొందండిలా!

అనుమానాస్పద వీడియో కాల్స్ వస్తే భయపడవద్దు, ఒక్క రూపాయి కూడా బదిలీ చేయవద్దు. మీకు ఏదైనా సందేహం ఉంటే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నేరుగా విచారించండి. ఒకవేళ పొరపాటున సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని డబ్బులు కోల్పోతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ప్యానిక్ కాకుండా అప్రమత్తంగా ఉండటమే సైబర్ నేరాలకు అసలైన విరుగుడు.